సన్ బర్న్ ఈవెంట్ వ్యవవహారం కొత్త మలుపు తిరిగింది. హైదరాబాద్ లో అట్టహాసంగా సాగిన ఈ ఈవెంట్ పై రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. సన్ బర్న్ ఈవెంట్ వెనక తెలంగాణ మంత్రి కెటీఆర్ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ ఉన్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలోనూ రేవంత్ ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా రేవంత్‌రెడ్డికి తెలంగాణ మంత్రి కే తారకరామారావు బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ లీగల్ నోటీసులు జారీచేశారు.
రేవంత్‌రెడ్డి తనపై అసత్య ఆరోపణలు గుప్పించారని లీగల్ నోటీసులో ఆయన పేర్కొన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలో జరిగిన సన్‌బర్న్ పార్టీకిగానీ, ఇతర ఈవెంట్లతోగానీ తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో తనకు ఎలాంటి పబ్‌లు లేవని, తనపై ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని లీగల్ నోటీసులలో రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ లీగల్ నోటీసు వ్యవహారంతో ఈ అంశం ఏ మలుపు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.