హైదరాబాద్ కు అత్యంత కీలకమైన ‘మెట్రో రైలు ప్రాజెక్టు’ అధికారికంగా పరుగులు పెట్టడం ప్రారంభించింది. ప్రధాని నరేంద్రమోడీ మియాపూర్ లోని మెట్రో రైలు పైలాన్ ను ఆవిష్కరించారు. అనంతరం మియాపూర్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన స్పల్పనిడివి మెట్రో రైలు విశిష్టలతో కూడిన చిత్రాన్ని వీక్షించారు. అనంతరం మోడీ, గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్, మంత్రి కెటీఆర్, మహమూద్ అలీలతో కలసి మియాపూర్ నుంచి కూకట్ పల్లి వరకూ మెట్రో రైలు ప్రయాణించారు. మళ్ళీ కూకట్ పల్లి నుంచి తిరిగి మియాపూర్ స్టేషన్ కు చేరుకున్నారు. ప్రధిన మోడీ అత్యంత కీలకమైన మెట్రో రైలును జాతికి అంకితం చేయటంతో బుధవారం నుంచి ప్రయాణికులకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రధాని మోడీ ప్రారంభించి ఎక్కిన మెట్రో రైలును నడిపింది మహిళా డ్రైవర్ కావటం విశేషం. తొలి దశలో మెట్రో రైలు ప్రాజెక్టు 30 కిలోమీటర్లు అంటే మియాపూర్ నుంచి నాగోల్ వరకు మెట్రోరైల్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సరిగ్గా మంగళవారం మధ్యాహ్నం 2.15 నిమిషాలకు మెట్రోరైల్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఇక నుంచి భాగ్యనగర వాసులు కొత్త ప్రయాణ అనుభూతిని పొందనున్నారు. అయితే ఇది పరిమిత రూట్లలోనే ఉండటంతో ట్రాఫిక్ సమస్య ఏ మేరకు తగ్గుముఖం పడుతుందనే అంశంపై అంచనాకు రావటానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.