తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మాట మార్చారు. తెలంగాణ సచివాలయానికి భయంకరమైన వాస్తు దోషం ఉందని..అందుకే సచివాలయాన్ని కొత్త చోట.. కొత్తగా కడతామని మీడియా సమావేశంలో బహిరంగంగా ప్రకటించారు. తొలినాళ్లలో చెప్పిన మాట ఇది. వాస్తు దోషం ఉందనే కారణంతోనే సచివాలయాన్ని మారుస్తారా? అంటూ పార్టీలతో పాటు ప్రజా సంఘాల నుంచి కూడా తీవ్ర విమర్శలు విన్పించాయి. వ్యవహారం కోర్టు గడప కూడా తొక్కింది. అక్కడే వ్యవహారం మలుపుతిరిగింది. వాస్తు సమస్యతో సచివాలయం మార్చాలనుకోవటంలేదని..ప్రస్తుత భవనాల్లో .అసలు ఫైర్ సేఫ్టీలేదని కోర్టుకు సర్కారు నివేదించింది
అప్పటి నుంచి ఫైర్ సేఫ్టీ అంశం ముందుకొచ్చి వాస్తు వెనక్కి వెళ్లింది. కానీ ముఖ్యమంత్రి తొలినాళ్లలో ప్రకటించిన ప్రధాన కారణం వాస్తుబాగాలేదనే. బుధవారం నాడు సచివాలయంలో కొత్త సచివాలయం అంశంపై మాట్లాడిన సీఎం కెసీఆర్ సచివాలయం మార్పునకు వాస్తు ఒక్కటే కారణం కాదని..అది కూడా ఓ అంశం మాత్రమే అని తెలిపారు. ఎవరు ఏమన్నా సరే కొత్త భవనాలు కట్టితీరతామని..ఓ వైపు ఏపీ కొత్త కొత్త డిజైన్లతో కొత్త భవనాలు కట్టుకుంటుంటే మనం అలాగే ఉండాలా? అని ప్రశ్నించారు.