తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. భారత్ కు వచ్చే విదేశీ అతిధులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర,, రాష్ట్ర ప్రభుత్వాలదే. అమెరికా అధ్యక్షుడు వంటి వారు అయితే సొంత భద్రతా ఏర్పాటు చేసుకుంటారు. ముందు వరసలో వాళ్ళే ఉంటారు..వెనక వరస మాత్రంలో భారత్ కు చెందిన వారు ఉంటారు. అమెరికా అధ్యక్షుడి భధ్రతా ఏర్పాట్లు అంటే అత్యంత పటిష్టంగా ఉంటాయి. అయితే పైకి ఏమీ కన్పించకుండానే ఎక్కువ శాతం నిఘా నేత్రాలతో పనిపూర్తిచేస్తారు. అవసరం అయితే ఎంతటి అత్యయిక పరిస్థితిని అయినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటారు. అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన వారిలో అత్యంత వివాదస్పదుడుగా మారిన డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెలాఖరున హైదరాబాద్ వస్తున్నారు.
ఇక్కడ జరిగే అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో ఆమె పాల్గొననున్నారు. ఇక్కడే కొత్త చిక్కు వచ్చిపడింది. హైదరాబాద్ లోని హెచ్‌ఐసీసీలో జరిగే ప్రపంచ పారిశ్రామిక సదస్సులోకి పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయుధాలతో ప్రవేశించేందుకు వీల్లేదని అమెరికా సెక్యూరిటీ వింగ్ స్పష్టం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇవాంక ట్రంప్ భద్రతతో పాటు దేశ ప్రధాని మోదీ భద్రత కూడా ముఖ్యమని, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రతలో ఉన్న ప్రధాని వెనుక ఆర్మ్ డ్ సిబ్బంది ఉండాలని కేంద్ర హోంశాఖతో పాటు ఎస్‌పీజీ పట్టుబడుతోంది. అయితే గతంలో టర్కీలో జరిగిన హైకమిషనర్ కాల్పుల వ్యవహారంతో అమెరికన్ సెక్యూరిటీ సదస్సులోకి ఎవరూ ఆయుధాలు తేవద్దన్న నిబంధనను పెడుతున్నట్టు కేంద్ర హోంశాఖ భావిస్తోంది.
ఇవాంకా ట్రంప్ భద్రతకు సంబంధించి అమెరికన్ సెక్యూరిటీయే ప్రత్యేకంగా వాహనాలు, సిబ్బందిని రంగంలోకి దించనున్నట్టు తెలుస్తోంది. సదస్సు బయటే ఎస్‌పీజీ, కేంద్ర రాష్ట్ర పోలీస్ బలగాలు భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని అమెరికన్ వైట్‌హౌస్ కేంద్ర హోంశాఖకు స్పష్టం చేసినట్టు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారింది. పటిష్టమైన భధ్రతా చర్యలకు సూచించటం తప్పులేదు కానీ..మనం ఎలా ఉండాలో అమెరికా నిర్ణయించటం సరికాదని కొంత మంది పోలీసు అధికారులు వాదిస్తున్నారు.