అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, అమెరికా సలహాదారుగా ఉన్న ఇవాంకా ట్రంప్ మంగళవారం తెల్లవారు జామున హైదరాబాద్ చేరుకున్నారు. ఆమెకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి ఆమె కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రత్యేక వాహనంలో మాదాపూర్ ప్రాంతంలో ఉన్న ట్రైటెండ్ హోటల్ కు వెళ్ళారు. ఇవాంకా హోటల్ నుంచి మధ్యాహ్నం తర్వాతే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు జరిగే ప్రాంతానికి చేరుకుంటారు.
అంతకంటే ముందు ఆమె భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తో హెచ్ఐసీసీలో భేటీ కానున్నారు. ప్రధాని మోడీ, ఇవాంకా ట్రంప్ లు మంగళవారం సాయంత్రం ఫలక్ నుమా ప్యాలెస్ లో జరగే విందులో పాల్గొననున్నారు. ఇవాంకా ట్రంప్ బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ బయలుదేరి వెళతారు. ఇవాంకా పర్యటన కోసం తెలంగాణ హెఛ్ ఐసిసి ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే.