హైదరాబాద్ కు ‘ఇవాంకా’ ఫీవర్

Update: 2017-11-23 04:23 GMT

తెలంగాణ సర్కారు అంతా ప్రస్తుతం ‘ఇవాంకా ట్రంప్’ ఫీవర్ లోనే ఉంది. ఆమె పర్యటన పూర్తయ్యే వరకూ ఇక మిగతా విషయాలు ఏమీ పట్టించుకునే పరిస్థితిలో లేరు ఎవరూ. హైదరాబాద్ లో ప్రస్తుతం రెండే రెండు హాట్ టాపిక్స్. ఒకటి ఇవాంకా ట్రంప్..రెండవది మెట్రో రైలు. ఈ రెండే ఇప్పుడు యూత్ లో విన్పించే మాటలు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ కు వచ్చే ఇవాంకా ఏమేమి చేస్తారో మీడియా కూడా విస్తృతం కవరేజ్ ఇస్తుండటంతో అందరి దృష్టి అటువైపే మళ్లుతోంది. అమె పర్యటించే కారు...నివాసం ఉండే ప్రాంతం...ఆమె భోజన ఏర్పాట్లు అంటూ మీడియా తెగ హడావిడి చేసేస్తోంది. ఇవాంకా ట్రంప్ భద్రత వ్యవహారం కూడా ఓ హాట్ టాపిక్. ఇవాంకా పర్యటన కోసం ఏకంగా అమెరికాకు చెందిన ప్రత్యేక నిఘా ఉపగ్రహం హైదరాబాద్‌ నగరాన్ని ప్రతీక్షణం పర్యవేక్షిస్తుంది అంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ (ఎస్‌ఎస్‌) ఏజెంట్లు ఆ శాటిలైట్‌ అందించే చిత్రాలను విశ్లేషించడానికి వెస్టిన్‌ హోటల్‌లో ప్రత్యేకంగా కమాండ్‌ పోస్ట్‌ ఏర్పాటు చేస్తున్నారు.

                                          హెచ్‌ఐసీసీలో జరగనున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు ఇవాంక, ప్రధాన నరేంద్రమోదీ రానున్న నేపథ్యంలో అమెరికన్‌ సీక్రెట్‌ సర్వీస్‌తో పాటు ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) కనీవినీ ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాయి. అమెరికాలోని హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఆధీనంలో ఈ ఉపగ్రహం పని చేస్తుంటుంది. ఇవాంక పర్యటన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఉపగ్రహాన్ని హైదరాబాద్‌ వైపు మళ్ళిం చారు. ప్రధానంగా ఇవాంక బస చేసే వెస్టిన్‌ హోటల్, హెచ్‌ఐసీసీ ఉన్న మాదాపూర్, అధికారిక విందు జరిగే ఫలక్‌నుమా ప్యాలెస్‌లతో పాటు ఆ చుట్ట పక్కల పది కిలోమీటర్ల పరిధిలో ఈ ఉపగ్రహం ప్రత్యేక నిఘా వేసి ఉంచుతుంది. హై రిజల్యూషన్‌ కెమెరాలతో ఫొటోలు తీయడం దీని ప్రత్యేకత. ఇవాంక ట్రంప్‌ కాన్వాయ్‌లో వినియోగిం చడానికి ప్రత్యేకంగా నాలుగు వాహనాలను అమెరికాకు చెందిన సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు హైదరాబాద్‌ తీసుకువచ్చారు. ఇవాంక ప్రయాణించే ప్రత్యేక కారు, కమ్యూనికేషన్, నిఘా తదితర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలతో కూడా మరో వాహనం సిటీకి చేరుకున్నాయి. ఇవాంక వాహనం వెనుక ఉండే ఫస్ట్‌ ఎస్కార్ట్, సెకండ్‌ ఎస్కార్ట్‌ వాహనాలను ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ నాలుగు వాహనాలు ఎస్‌ఎస్‌ ఏజెంట్ల పర్యవేక్షణలో ఓ రహస్య ప్రాంతం లో దాచి ఉంచారు. ఇవాంక వినియోగించే కారు మైన్‌ప్రూఫ్‌ మాత్రమే కాదని.. అనుధార్మికత ఉన్న ఆయుధాల దాడుల్నీ తట్టుకుంటుందని అధికారులు చెప్తున్నారు.

 

Similar News