భాగ్యనగర ప్రజలకు వచ్చే బుధవారం నుంచి కొత్త రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోడీ..తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ లు ఇద్దరూ హైదరాబాద్ మెట్రో సర్వీసులను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఆ మరుసటి రోజు నుంచే ప్రజలకు ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. దీంతో ఎల్ అండ్ టి మెట్రో రైలు సంస్థ ఛార్జీలను ప్రకటించింది. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించాలంటే కనీస ధర పది రూపాయలుగా..గరిష్ట ధర 60 రూపాయలుగా నిర్ణయించారు. ఈమేరకు ఎల్ అండ్ టి మెట్రో రైలు శనివారం సాయంత్రం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రెండు కిలోమీటర్ల వరకూ టిక్కెట్ ధర పది రూపాయలు, 2 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల వరకూ 15 రూపాయలు, 4 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకూ 25 రూపాయలకు, 6 నుంచి 8 కిలోమీటర్ల వరకూ 30 రూపాయల ఛార్జీని నిర్ణయించారు.
8 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల వరకూ 35 రూపాయలు, 10 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ల వరకూ 40 రూపాయలు, 18 కిలోమీటర్ల నుంచి 22 కిలోమీటర్ల వరకూ 50 రూపాయలు, 22 కిలోమీటర్ల నుంచి 26 కిలోమీటర్ల వరకూ 55 రూపాయలు, 26 కిలోమీటర్లపైబడిన దూరానికి 60 రూపాయలుగా టిక్కెట్ ధర ఖరారు చేశారు. మెట్రో ప్రయాణానికి గాను ఆదివారం నుంచే స్మార్ట్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. నాగోల్, తార్నాక, ఎస్ ఆర్ నగర్, ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు స్మార్ట్ కార్డులు అందుబాటులో ఉంచనున్నారు.