హైపర్ ఆది మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్న షోలు నిత్యం వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. తాజాగా ఆయన జబర్దస్త్ షోలో నిర్వహించిన స్కిట్ లో అనాథ బాలలను అవమానించారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇదే కారణంతో ఆది తమ మనోభావాలు దెబ్బతీశారని..ఆయన తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని కొంత మంది అనాథ బాలలు ఓ వైపు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయటంతో పాటు...ఆదిపై మానవ హక్కుల సంఘానికి (హెచ్‌ఆర్సీ) ఫిర్యాదు కూడా చేశారు.
తమ మనోభావాలను దెబ్బతీసేలా స్కిట్ చేశారని ఆరోపిస్తూ పలువురు అనాథ ఆశ్రమ పిల్లలు, సినీ విమర్శకుడు కత్తి మహేష్‌లు హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. గత గురువారం టీవీలో ప్రసారమైన స్కిట్‌లో తమపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జబర్దస్త్ కార్యక్రమంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని కత్తి మహేష్ ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. బాలల హక్కులు, మానవ హక్కులను నాశనం చేసేలా జబర్దస్త్ లో స్కిట్లు వేస్తుండటం పట్ల కేసు నమోదైందని, తన మద్దతు అనాథలకే అని పోస్ట్ చేశాడు.