దుబాయ్ లో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చింది. అదే ప్రపంచంలోని తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే దీన్ని అభివృద్ధి చేశారు. దుబాయ్ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఎయిర్ ట్యాక్సీ లో ప్రయాణించాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న ఈ స్టేషన్ కు వెళ్లి కోరుకున్న చోటుకు వేగంగా వెళ్లిపోవచ్చు. రోడ్ మార్గంలో అయితే 45 నిమిషాల్లో వెళ్లే ప్రాంతానికి ఎయిర్ ట్యాక్సీ లో అయితే పది నిమిషాల్లో వెళ్లొచ్చు. దుబాయ్ లోని కీలక ప్రాంతాలు అయిన డౌన్ టౌన్ తో పాటు పామ్ జ్యూమెర, దుబాయ్ మరీనా లను ఎయిర్ ట్యాక్సీ సౌకర్యాలతో అనుసంధానించనున్నారు. సంవత్సరానికి లక్షా డెబ్భై వేల మంది ప్రయాణించేలా ఈ ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ ను డెవలప్ చేశారు. దుబాయ్ యువరాజు షేక్ హందాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ పలు శాఖలకు చెందిన అధికారులతో కలిసి శుక్రవారం నాడు ఈ స్టేషన్ ను సందర్శించి ఇందులోని సౌకర్యాలు పరిశీలించారు.
ఈ వెర్టిపోర్ట్ నుంచి లో కాస్ట్ ఫ్లైయింగ్ ట్యాక్సీ లను కూడా అనుమతించనున్నారు. ఫ్యూచర్ మొబిలిటీ విషయంలో తాము మరో అడుగు ముందుకు వేసినట్లు ఈ సౌకర్యాన్ని పరిశీలించిన తర్వాత షేక్ హందాన్ వెల్లడించారు. మెట్రో, బస్ లతో పాటు స్మార్ట్ అండ్ ఎయిర్ మొబిలిటీ ద్వారా ప్రయాణికులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఒక్కో ఎయిర్ ట్యాక్సీ ద్వారా నలుగురు ప్రయాణికులను గమ్య స్థానానికి చేర్చే అవకాశం ఉంటుంది. ఈ ఏడాదిలోనే దుబాయ్ లో ఎయిర్ ట్యాక్సీ ల వాణిజ్య సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఉబర్ బ్లాక్ ద్వారా ప్రయాణికులు ఈ ఎయిర్ ట్యాక్సీ లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఎయిర్ ట్యాక్సీ లు వెర్టికల్ గా టేక్ ఆఫ్ అవటంతో పాటు లాండింగ్ కూడా అవుతాయి అనే విషయం తెలిసిందే.
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి నిత్యం పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించే దుబాయ్ ఇప్పుడు వెలవెల పోతోంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కారణంగా గత 50 రోజులుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి నిత్యం అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కూడా షెడ్యూల్ సర్వీసులు నిలిచిపోయాయి. పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తున్నా కూడా గతంలో లాగా ఎప్పుడు అంటే అప్పుడు దుబాయ్ వెళ్లి వచ్చే పరిస్థితి లేదు. గత కొన్ని రోజులుగా కాల్పుల విరమణ అమలులో ఉన్నా కూడా అదే పరిస్థితి. తర్వలో ఇరాన్, అమెరికాల మధ్య శాశ్వత శాంతి ఒప్పందం కుదిరితే తప్ప తిరిగి సాధారణ వాతావరణం వచ్చే అవకాశం కనిపించటం లేదు. త్వరలోనే రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి.