ఢిల్లీ వేదికగా మరో భారీ పోరాటానికి రంగం సిద్ధం అవుతుందా అంటే...పరిణామాలు ఆ దిశగానే కదులుతున్నాయి. దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో సాగుతున్న వ్యవహారంలో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి అనే విషయం ఇప్పుడు బయటకు రావటంతో దేశంలోని ప్రధాన పార్టీలు అన్ని కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఈసి) జ్ఞానేశ్ కుమార్‌ తక్షణమే రాజీనామా చేయటంతో పాటు ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం లోని ఇద్దరు కమిషనర్లే సర్ సాగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయటంతో ఎన్నికల సంఘం సాఫ్ట్ వేర్ విషయంలో కూడా వీళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఆధారాలతో సహా కథనం ప్రచురించింది. తాజా పరిణామాలతో మరో సారి ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపీ) రంగంలోకి దిగింది. సిజెపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే గురువారం నాడు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సర్ అక్రమాల వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశప్రజాస్వామ్యానికి సీఈసీ అతిపెద్ద ముప్పుగా మారారని అన్నారు.

                                         రాబోయే 48 గంటల్లోగా ఆయన రాజీనామా చేయకపోతే దేశవ్యాప్త నిరసనలకు తెరతీస్తామని అల్టిమేటమ్ జారీ చేశారు. లేదు అంటే జంతర్ మంతర్ 2 చేపడతామని హెచ్చరించారు. ఓటర్ల తొలగింపు, తిరిగి చేర్చే విధానంపై ఈసీలు సుఖ్‌బీర్ సంధూ, వివేక్ జోషి అభ్యంతరాలను పక్కనపెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజా పత్రికా సమావేశంలో అభిజీత్ దీప్కే సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై మండిపడ్డారు. ఈ ఉదంతాలు ప్రధాన ఎన్నికల కమిషనర్ దేశంలోనే అతిపెద్ద దేశద్రోహి అని నిరూపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.జ్ఞానేశ్ కుమార్ సీఈసీగా బాధ్యతలు చేపట్టినప్పటి నాటి నుంచి దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్లకు పైగా ఓట్లను రద్దు చేశారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అభిజీత్ దీప్కే అన్నారు. 2024 లోక్‌ సభ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష కూటమి మధ్య గెలుపోటముల వ్యత్యాసం కేవలం రెండు శాతం మాత్రమే ఉందనే విషయాన్ని నిగుర్తు చేశారు. ఆ తేడాను ప్రభావితం చేయడానికే ఈ స్థాయిలో ఓట్లు తొలగించారా అని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.

                                         బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చనే భయంతోనే ప్రాంతీయ శక్తులను బలహీనపరిచేందుకు ఈ వ్యూహం పన్నారని ఆరోపించారు. పశ్చిమబెంగాల్లో మమత బెనర్జీ నియోజకవర్గాల నుంచి ఓట్లు తొలగించడం ఆమె ఓటమికి కారణమైంది చెప్పారు. సుమారు లక్ష ఓట్లు తొలగించటం తమిళనాడు ఎం.కె. స్టాలిన్ ఓటమికి దారితీసిందని అన్నారు. ఢిల్లీలో కూడా ఇదే జరిగిందని చెప్పారు. ప్రతిపక్ష నేతలను దెబ్బతీసేలా ఓట్ల తొలగింపులు జరుగుతుంటే, దానిని స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలు అని ఎలా అంటారని అభిజీత్ దీప్కే ప్రశ్నించారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా విషయంలో తాము వెనక్కు తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. సిజెపీ కో కన్వీనర్ సౌరవ్ దాస్ మాట్లాడుతూ తాము మూడు డిమాండ్ లను ఈసీ ముందు ఉంచుతామని అన్నారు. సిఈసి రాజీనామా చేయటంతో పాటు ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని...సర్ ను నిలిపివేసి 2025 ఓటర్ల జాబితానే పరిగణనలోకి తీసుకోవాలని...సర్ కు సంబదించిన ఫైల్స్ అన్నిటికి సుప్రీం కోర్ట్ నియమించిన కమిటీ అధీనంలో ఉంచాలన్నారు.

Tags: