దేశంలోని ప్రధాన ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసిఐ) పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఈసి) జ్ఞానేశ్ కుమార్ తీరు పై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కీలక నేతలు. చాలా మంది ఆయన ఎన్నికల వ్యవస్థను కేంద్రంలో అధికారంలో బీజేపీ కి అనుకూలమైన ఆయుధంగా మార్చారు అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తో పాటు దేశంలోని ప్రధాన పార్టీ ల నేతలు కూడా ఆయనపై తీవ్ర విమర్శలు చేశాయి. ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పేరుతో పెద్ద ఎత్తున ఓట్లు తొలగిస్తూ బీజేపీ గెలుపుకు బాట వేస్తున్నారు అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ప్రముఖ ఆంగ్ల పత్రిక ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ బుధవారం నాడు ప్రచురించిన కథనం ఒక్కసారి దేశ వ్యాప్తంగా పెద్ద దుమారానికి కారణం అయింది. అదే సమయంలో తాజాగా సర్ పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు కూడా మరింత దుమారం రేపాయి. సర్ కింద నోటీసులు పూర్తి యాంత్రికంగా ఇస్తున్నారు అని అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు ఏ ప్రాతిపదికన నోటీసులు ఇస్తున్నారో ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

                                           గత పది నెలల కాలంలో ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్లు ఎన్నికల సంఘం చర్యలపై 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం పేర్కొంది. తమకు ఏ మాత్రం తెలియకుండా కొత్త ఓటర్లను యాడ్ చేసి...జాబితాలోని పేర్లను తొలగించారు అని ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సందు , వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ చర్యలు అన్ని అనధికారికం, అక్రమం అని పేర్కొన్నారు వీళ్ళిద్దరూ. 2025 జూన్ లో బీహార్ లో సర్ మొదలైంది. అప్పటి నుంచి దేశంలో సాధారణంగా ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేసే ప్రక్రియగానే భావించే ఈ సవరణలో భాగంగా 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్లకు పైగా పేర్లను తొలగించారు అని వెల్లడించారు. దీంతో ఎవరికి ఓటు వేసే హక్కు ఉండాలి, ఎవరికి ఉండకూడదు అనే అంశాన్ని నిర్ణయించడంలో ఎన్నికల సంఘం పోషిస్తున్న పాత్రపై దేశవ్యాప్తంగా తీవ్ర ప్రజా చర్చకు దారితీసింది అని ఈ స్టోరీ లో ప్రస్తావించారు. రాష్టానికి చెందిన ఎన్నికల సంఘం అధికారులను బై పాస్ చేసి మరీ ఓటర్ల డేటా బేస్ ను ఢిల్లీ వేదికగా కేంద్రీకృతం చేశారు అని ...అంతే కాకుండా ఓటర్ సాఫ్ట్‌వేర్ సమగ్రతపై ఆందోళన వ్యక్తం చేసిన..దీంతో విభేదించిన కమిషనర్లు క్యాబినెట్ సెక్రటరీ దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

                                           ఇది ఎన్నికల సంఘంలో అసాధారణమైన విబేధాలను సూచిస్తుంది... దాని పనితీరుపై అనుమానాలను రేకెత్తించేదిలా మారింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ స్టోరీ వచ్చిన వెంటనే మరో సారి దేశంలోని పార్టీలు అన్నీ కూడా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఇవి ఎన్ని చూస్తుంటే కేంద్ర ఎన్నికల సంఘంపై గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న ఆరోపణలు నిజం అనే అనుమానాలు మరింత బలోపేతం అయ్యేలా ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారానికి కారణం కావటంతో ఎన్నికల సంఘం కూడా అధికారికంగా స్పందించింది. ఈ స్పందన మరిన్ని అనుమానాలు పెంచేలా ఉంది తప్ప ఇండియన్ ఎక్స్ ప్రెస్ స్టోరీ లో లేవనెత్తిన కీలక ప్రశ్నలకు మాత్రం అందులో సమాధానం లేదు. ఈసిఐ వివరణలో ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి. 10 నెలల కాలానికి సంబంధించిన కొన్ని నిర్దిష్ట అంతర్గత నోట్లు, పరిశీలనలను మాత్రమే హైలైట్ చేస్తూ, అదే సమయంలో పెద్ద సంఖ్యలో ఉన్న ఆమోదాలు, నిర్ణయాలు, ఆదేశాలు, కార్యక్రమాలను విస్మరించడం వల్ల మొత్తం అంశంలో ఒక భాగం మాత్రమే కనిపిస్తోంది.

                                                  ఇటీవలి నెలల్లో ఎన్నికల సంఘం అనేక నిర్ణయాలు తీసుకుంది, ఆదేశాలు జారీ చేసింది, సుమారు 40 కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ (SIR) నిర్వహణతో పాటు అనేక ఎన్నికల సంస్కరణలను చేపట్టింది. గత ఏడాది కాలంలో పూర్తి ఎన్నికల సంఘం ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే ఈ చర్యలన్నీ చేపట్టబడ్డాయి అని చెప్పుకొచ్చింది. ముసాయిదా దశల్లో ఎన్నికల సంఘం సభ్యులు లేవనెత్తే ఏవైనా కార్యాచరణ సంబంధిత ప్రశ్నలు లేదా సూచనలు ఓటర్ల హక్కులను పరిరక్షించేందుకు అనుసరించే సాధారణ పరిపాలనా విధానంలో భాగమే. ఎన్నికల కమిషనర్లు చేసిన సూచనలు ఎన్నికల ప్రక్రియలను మరింత మెరుగుపరచడం కోసమే. ఏ సంస్థలోనైనా చర్చల ప్రక్రియలో భిన్నాభిప్రాయాలు, పరిశీలనలు సాధారణమే. తుది నిర్ణయం తీసుకునే ముందు జరిగే నిర్ణయ ప్రక్రియలో అవి ఒక భాగం. ముగ్గురు కమిషనర్లు మాత్రమే కాకుండా, ఎన్నికల సంఘంలోని ప్రతి అధికారి కూడా ఎన్నికల వ్యవస్థను మెరుగుపరచేందుకు ఎన్నికల సంఘానికి తన సూచనలు అందించడానికి పూర్తిగా అధికారం కలిగి ఉంటారు అని పేర్కొంది. ఎన్నికల సంఘం జారీ చేసే అన్ని అధికారిక ఉత్తర్వులు, నిర్ణయాలు, పరిపాలనా ఆదేశాలకు పూర్తి చట్టపరమైన అనుమతి ఉంటుంది. ఇవన్నీ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ (అపాయింట్‌మెంట్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్) యాక్ట్, 2023 కింద నిర్దేశించిన చట్టబద్ధ విధానాలను అనుసరిస్తాయి అని వివరణ ఇచ్చింది.

Tags: