కొత్త మలుపులు తీసుకోనున్న యుద్ధం

Update: 2026-07-17 07:23 GMT

అమెరికా, ఇరాన్ యుద్ధం కొత్త కొత్త మలుపులు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా అమెరికా ఏ మాత్రం విరామం లేకుండా ఇరాన్ పై దాడులు చేస్తూ ఆ దేశాన్ని మరింత బలహీనపరిచే పనిలో ఉంది. అమెరికా దాడులు చేసిన ప్రతిసారి ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఎటాక్ చేస్తూనే ఉంది. తాజా దాడుల్లో అమెరికా ఏకంగా ఇరాన్ లోని బ్రిడ్జిలు...ఇతర మౌలిక సదుపాయాలపై కూడా దాడులకు దిగింది. అమెరికా చేసిన దాడుల కారణంగా ఇప్పటికే ఇరాన్ లో ఏకంగా 30 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. హర్ముజ్ ప్రావిన్సులోని రోడ్డు, రైల్ నెట్వర్క్ ను అమెరికా టార్గెట్ చేసి దాడులు చేసింది. కిష్ ద్వీపంలో దాడులతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. కొద్ది రోజుల క్రితం డోనాల్డ్ ట్రంప్ చెప్పినట్లుగానే ఇప్పుడు ఇరాన్ మౌలిక సదుపాయాలపై కూడా అమెరికా పెద్ద ఎత్తున దాడులు చేస్తుండంతో పశ్చిమాసియాలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. చాబహర్ లోని మారిటైం కంట్రోల్ టవర్ పై అమెరికా ఏకంగా మూడు సార్లు దాడిచేయడంతో అది పూర్తి గా కూలిపోయింది.

                           ఈ ఫోటో లను కూడా అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్ సెత్ ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు. అమెరికా దాడులకు ప్రతీకారంగా దాని మిత్ర దేశాలైన కువైట్‌, జోర్డాన్‌, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తోంది. అమెరికా దాడులపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్ జీసి) గల్ఫ్ దేశాల్లో ఉన్న డోనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత ఆస్తులను టార్గెట్ చేసుకోవాలని నిర్ణయించినట్లు ఇరాన్ మీడియా లో వార్తలు వచ్చాయి. ఇందులో ట్రంప్ పేరుతో నడిచే హోటళ్లతో పాటు గోల్ఫ్ క్లబ్ లు కూడా ఉన్నట్లు చెపుతున్నారు. గల్ఫ్ దేశాల్లో డోనాల్డ్ ట్రంప్ కు పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. అయితే ఐఆర్ జీసి వీటిపై ఎలా... ఏ రూపంలో దాడి చేస్తుంది అన్నది ఇప్పుడు గల్ఫ్ దేశాలను టెన్షన్ కు గురి చేస్తోంది. ఇదే జరిగితే యుద్ధం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News