వచ్చే ఏడాది నుంచి టాటా గ్రూప్ కంపెనీలను నడిపించేది ఎవరు?. ఇదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ రాజీనామా ప్రకటనతో ఆయన తర్వాత ఈ బాధ్యతలు చేపట్టేది ఎవరు?. చంద్రశేఖరన్ ప్లేస్ ను భర్తీ చేయటం అంత ఈజీ గా సాధ్యం అవుతుందా అన్న చర్చ సాగుతోంది కార్పొరేట్ వర్గాల్లో. టాటా గ్రూప్ లోని ఏ కంపెనీకి ఆ కంపెనీకి సమర్ధవంతమైన నాయకత్వం ఉన్నా కూడా మొత్తం టాటా సన్స్ ను పర్యవేక్షించే నాయకుడు కూడా ఎంతో కీలకం అన్న సంగతి తెలిసిందే. ఒక్క రాజీనామా నిర్ణయం బుధవారం నాడు దేశ కార్పొరేట్ రంగంలో పెద్ద సంచనలంగా మారింది. అది కూడా దిగ్గజ టాటా సన్స్ చైర్మన్ రాజీనామా అంటే మాములు విషయం కాదు. ఎందుకంటే గత గత నాలుగు దశాబ్దాలుగా టాటా గ్రూప్ తో ఆయనకు ఉన్న అనుబంధం అలాంటిది. అదే సమయంలో టాటా గ్రూప్ కంపెనీల పురోగతి విషయంలో ఆయన చూపించిన ప్రభావం ఎంతో.

                               గత కొంత కాలంగా టాటా సన్స్ ట్రస్ట్ బోర్డు సభ్యుల మధ్య పలు విషయాల్లో విబేధాలు బహిర్గతం అయిన సంగతి తెలిసిందే. వాటి పర్యవసానమే ఇప్పుడు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు. టాటా సన్స్ చైర్మన్ గా ఉన్న ఆయన తన పదవి కాలం పూర్తి అయ్యే వరకు అంటే 2027 ఫిబ్రవరి వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ లోగా టాటా సన్స్ కొత్త చైర్మన్ ఎంపిక పూర్తి చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి చంద్రశేఖరన్ కు మరో టర్మ్ ఎక్స్ టెన్షన్ ఇవ్వాలనే ప్రతిపాదన రాగా..దీనికి టాటా సన్స్ బోర్డు ఆమోదం రాలేదు. తన నియామకం విషయంలో ఏకాభిప్రాయం లేకపోవటంతో ఆయన ఇప్పుడు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 18న జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)కు ముందే చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా ప్రకటన చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. 2017లో టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన గత దశాబ్ద కాలంగా సంస్థకు చెందిన వివిధ కంపెనీల అభివృద్ధిలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. టాటా గ్రూప్‌తో చంద్రశేఖరన్‌కు దాదాపు 40 ఏళ్ల అనుబంధం ఉంది.

                              చంద్రశేఖరన్ రాజీనామాతో బుధవారం నాడు పలు టాటా గ్రూప్ షేర్లు పతనం అయ్యాయి. ముఖ్యంగా ఈ ప్రభావం టిసిఎస్ షేర్ల మీద బాగా పడింది. బిఎస్ఈ లో ఈ కంపెనీ షేర్లు 90 రూపాయలు మేర నష్టపోయి 2349 రూపాయల వద్ద ముగిశాయి. టిసిఎస్ తో పాటు ట్రెంట్, టైటాన్, టాటా స్టీల్ తదితర టాటా కంపెనీల షేర్లు నష్టపోయాయి. మొత్తం మార్కెట్ పై కూడా చంద్రశేఖరన్ రాజీనామా వార్తల ప్రభావం పడింది. టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటా‌తో విభేదాల కారణంగానే చంద్రశేఖరన్ రాజీనామా చేసినట్లు చెపుతున్నారు. టాటా సన్స్ ఎంతో పెద్ద సంస్థ..ఎన్నో కీలక ప్రాజెక్ట్ లు అమలు లో ఉన్నాయని చంద్రశేఖరన్ తన లేఖలో పేర్కొన్నారు. ఇంతటి భారీ సంస్థను సమర్ధవంతంగా నడిపించటానికి ఒక నాయకుడు ఉండటం అవసరం అని..దీంతో పాటు ఉద్యోగులు..వాటాదారులు..భాగస్వాములు, పెట్టుబడిదారులకు నాయకత్వంపై స్పష్టత ఇవ్వటం కూడా ఎంతో ముఖ్యం అన్నారు. తన రాజీనామా లేఖలో ఆయన పలు విషయాలను ప్రస్తావించారు.

Tags: