దేశంలో అంతకంతకూ పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) రంగంలోకి దిగింది. ద్రవ్యోల్బణం పెరగటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పెరిగిన ధరలు పెద్ద సమస్యగా మారాయి. అందుకే ఆకస్మికంగా ఆర్ బీఐ వడ్డీ రేట్ల పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అత్యవసరంగా సమావేశం అయిన ఆర్ బిఐ రెపో రేటుతోపాటు కీలక వడ్డీ రేట్లలో మార్పులు చేయనున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగానే రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్ బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా చేసిన పెంపుతో రెపో రేటు 4.40 శాతానికి చేరింది. పెంచిన ఈ రేట్లు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించారు. రెపో రేటుతోపాటు నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను కూడా 50 బేసిస్ పాయింట్లు పెంచారు. దీంతో సీఆర్ఆర్ 4.50కి చేరింది. సీఆర్ఆర్ పెంచటంతో మార్కెట్లో నగదు లభ్యత తగ్గుముఖం పడుతుందనే విషయం తెలిసిందే. అయితే సీఆర్ఆర్ పెంపు మే 21 నుంచి అమల్లోకి రానుందని తెలిపారు. 2018 ఆగస్టు తర్వాత ఆర్ బిఐ వడ్డీరేట్లను పెంచటం ఇదే మొదటిసారి కావటం విశేషం. జీడీపీలో రుణాల శాతం ఎక్కువగానే ఉందని ఆర్ బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అంగీకరించారు. ప్రగతి రేటు స్థిరీకరణ, పెంపుదల టార్గెట్ గానే తాము ఈ మార్పులు చేశామని పేర్కొన్నారు.
పలు అంతర్జాతీయ, దేశీయ అంశాలు ఈ నిర్ణయానికి కారణం అయ్యాయని..అయినా కూడా తాము ఆచితూచి అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పునరుత్తేజం నెమ్మదిస్తోందని అన్నారు. రెండు రోజుల క్రితమే సింగపూర్ ప్రధాన మంత్రి లీ కూడా ప్రపంచం మాంద్యం దిశగా అడుగులు వేస్తోందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆర్ బిఐ గవర్నర్ మాంద్యం వంటి పదాలు ఉపయోగించకపోయినా ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థ పునరుత్తేజం నెమ్మదిస్తోందని ప్రకటించటం ఆందోళనకర పరిణామంగా భావిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ ల యుద్ధం పలు దేశాల ఇంథన బిల్లుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అదే సమయంలో పలు రేట్లు పెరిగి కీలక రంగాలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఆర్ బిఐ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం తో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. బుధవారం ఉదయం నుంచే నష్టాల్లో ఉన్నప్పటికీ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడ్డాక మరింత పతనం అయ్యాయి. బీఎస్ ఈ సెన్సెక్స్ ఏకంగా 1300 పాయింట్ల మేర నష్టపోయింది.