మెగా ఐపీఓ అంటే ఫలితం ఎలా ఉంటుందో హ్యుండయ్ మోటార్ ఇండియా మరో సారి ప్రూవ్ చేసింది. ఇన్వెస్టర్లకు ఇది చాలా కాస్ట్లీ గా మారింది. షేర్ ధరతో పాటు లిస్ట్ అయిన తోలి రోజు ఇన్వెస్టర్లకు హ్యుండయ్ మోటార్ ఇండియా చూపించిన నష్టాలు కూడా చాలా ఖరీదుగానే ఉన్నాయి. మంగళవారం బిఎస్ఈ, ఎన్ఎస్ఈ లో నమోదు అయిన ఈ షేర్లు మార్కెట్ క్లోజింగ్ సమయానికి 140 రూపాయల నష్టంతో 1820 రూపాయల వద్ద ముగిశాయి. అంటే ఒక్క షేర్ పై మదుపరులు తొలిరోజు 140 రూపాయలు నష్టపోయినట్లు అన్న మాట. ఒక్క లాట్ అంటే ఏడు షేర్లు అలాట్ మెంట్ పొందిన ఇన్వెస్టర్లు కూడా 980 రూపాయలు నష్టపోయినట్లు అయింది. ఇప్పుడు ఇన్వెస్టర్ల మదిలో ఉన్న ప్రశ్నలు ఇవే. హ్యుండయ్ ఇండియా మోటార్ షేర్ల పతనం ఎక్కడ ఆగుతుంది...ఈ షేర్లు ఎప్పుడు లాభాల బాటలోకి వస్తాయి. ఇవే ఇప్పుడు ఇన్వెస్టర్లకు కీలకం. అయితే దీనిపై ఒక్కో సంస్థ ఒక్కో అంచనాను వెలువరిస్తోంది.
ప్రస్తుత ట్రెండ్ చూస్తే మార్కెట్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఎంకే గ్లోబల్ ఫైనాన్సియల్ మాత్రం హ్యుండయ్ మోటార్ ఇండియా టార్గెట్ ప్రైస్ 1750 రూపాయలు గా నిర్ణయించింది. దీనికి ఈ సంస్థ పలు అంశాలను ప్రస్తావించింది. వచ్చే 12 నుంచి 18 నెలల పాటు కంపెనీ కొత్తగా ఎలాంటి ప్యాసెంజర్ వాహనాలను విడుదల అవకాశం లేదు అని...అధిక రాయల్టీ తో పాటు పలు అంశాలు షేర్ ప్రైస్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది అని పేర్కొంది. 2026 ఆర్థిక సంవత్సరం సెకండ్ హాఫ్ లో ఏడు సీట్లతో కూడిన ఎస్ యూవీ విడుదల, 2030 నాటికీ పది కొత్త ఉత్పత్తుల విడుదల వంటి అంశాలతో రాబోయే కాలంలో ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉపయోగపడే అవకాశం ఉంది అని వెల్లడించింది. మరో సంస్థ నోమురా హోల్డింగ్స్ మాత్రం హ్యుండయ్ మోటార్ ఇండియా షేర్లకు బై రేటింగ్ ఇచ్చింది. కంపెనీ అమ్మకాల వృద్ధి ఆశాజనకంగా ఉండటం..వాహనాల ధరలు పెరిగే అవకాశం ఉంది అంటూ హ్యుండయ్ షేర్ ధర 2472 రూపాయలకు పెరిగే అవకాశం ఉంది అని వెల్లడించింది.