గుడ్ స్టార్ట్. దేశీయ స్టాక్ మార్కెట్లు నూతన సంవత్సరం తొలి రోజు లాభాల బాటలో పయనించాయి. బుధవారం నాడు మార్కెట్ లు ఫ్లాట్ గా ప్రారంభం అయినా కూడా తర్వాత కొనుగోళ్ల మద్దతుతో లాభాల బాట పట్టాయి. తొలి రోజు మార్కెట్ గ్రీన్ లో ముగియటంతో ఇన్వెస్టర్లు హ్యాపీ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక పాజిటివ్ సంకేతం పంపుపుతుంది అనటంలో సందేహం లేదు. బిఎస్ఈ సెన్సెక్స్ 368 పాయింట్ల లాభంతో 78 ,507 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 23743 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. అయితే 2025 సంవత్సరం లో స్టాక్ మార్కెట్ పయనంపై నిపుణుల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మార్కెట్ కదలికలను పలు అంశాలు ప్రభావితం చేస్తాయి అనే విషయం తెలిసిందే. అయితే ఎక్కువ మంది నిపుణులు మాత్రం 2024 సంవత్సరం లా కాకుండా కొత్త సంవత్సరంలో ఎక్కువ లాభం లార్జ్ క్యాప్ షేర్లలోనే ఉంటుంది అని అంచనా వేస్తున్నారు.
గత ఏడాది మిడ్ క్యాప్ తో పాటు స్మాల్ క్యాప్ షేర్లు కూడా ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ ఇచ్చాయి. అయితే నూతన సంవత్సరం ఎక్కువ ఫోకస్ లార్జ్ క్యాప్ షేర్స్ పైనే ఉంటుంది అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో కీలక విషయం ఏమిటి అంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వ వ్యయం పెరగటంతో గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరిగితే మార్కెట్ లు ఈ ఏడాది కూడా కొత్త కొత్త రికార్డు లు నమోదు చేయటం ఖాయం అనే అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు ఈ ఏడాది ఆర్ బిఐ వడ్డీ రేట్ల తగ్గింపుపై తీసుకునే నిర్ణయం కూడా మార్కెట్ లకు అత్యంత కీలకం కానుంది.