కొద్ది నెలల క్రితం వరకు స్టాక్ మార్కెట్ లో కరెక్షన్ అన్న పదం వినపడలేదు. అప్పుడప్పుడు మార్కెట్ పతనం అయినా కూడా ఆ వెంటనే రెట్టింపు జోష్ తో దూసుకు పోయిన సంగతి తెలిసిందే. కానీ అక్టోబర్ నెల మాత్రం ఈ ఏడాదిలో ఇన్వెస్టర్లకు భారీ షాక్ ఇచ్చిన నెలగా మిగిలింది. మరి దీపావళి మూరత్ ట్రేడింగ్ నుంచి అయినా మార్కెట్లు తిరిగి లాభాల బాట పడతాయా లేదా అన్నది వేచిచూడాల్సిందే. సెకండరీ మార్కెట్ జోష్ తో ఐపీవో లు కూడా గత రెండు నెలలుగా పెద్ద ఎత్తున ఎంట్రీ ఇచ్చి నిధుల సమీకరణలో కొత్త కొత్త రికార్డు లు నమోదు చేశాయి.గత కొంత కాలంగా దెబ్బ తిన్న సెంటిమెంట్ తో రిటైల్ ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దేశ ఐపీఓ చరిత్రలోనే అతి పెద్ద ఇష్యూ గా నిల్చిన హ్యుండయ్ మోటార్ ఇండియా కు కూడా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి అతి తక్కువ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తానికి హ్యుండయ్ ఇండియా ఐపీవో బయటపడినా కూడా రిటైల్ ఇన్వెస్టర్ల స్పందన..ఆ తర్వాత లిస్టింగ్ లో కూడా హ్యుండయ్ ఆఫర్ ధర కంటే దిగువనే కంపెనీ షేర్లు నమోదు అయ్యాయి. దీంతో భారీ ఇష్యూల పై ఇన్వెస్టర్లు ఒకింత టెన్షన్ లో ఉన్నారు అనే చెప్పాలి.
ప్రస్తుతం నడుస్తున్న ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ కి రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న స్పందన అంతంత మాత్రంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ షాపుర్జీ పల్లోంజీ గ్రూప్ కు చెందిన కంపెనీ అయినా కూడా ఇన్వెస్టర్లు ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా దూకుడు చూపించటం లేదు. ఈ తరుణంలో వచ్చే నెల మొదటి వారంలోనే మరో ప్రముఖ ఐపీవో మార్కెట్ లోకి రానుంది. అదే స్విగ్గీ . స్విగ్గీ ఇష్యూ నవంబర్ ఆరు న ప్రారంభం అయి ఎనిమిదవ తేదీన ముగిసే అవకాశం ఉంది అని వార్తలు వచ్చాయి. స్విగ్గీ ఇష్యూ పరిమాణం పది వేల కోట్ల రూపాయల పైనే ఉంటుంది అనే అంచనాలు ఉన్నాయి. ఇంకా ధరల శ్రేణిని మాత్రం ఖరారు చేయలేదు. డేట్స్ మాత్రం నవంబర్ 6 -8 ల మధ్య ఉండటం ఖాయం అని తేలిపోయింది. కంపెనీ త్వరలోనే ధరల శ్రేణి తో పాటు ఇష్యూ సైజు , డేట్స్ ను అధికారికంగా వెల్లడించనుంది. మరో ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో స్టాక్ మార్కెట్ లో మంచి జోష్ చూపిస్తున్నందున స్విగ్గీ ఐపీవో ప్రస్తుతం ఉన్న సెంటిమెంట్ ను అధిగమించి సక్సెస్ అందుకునే అవకాశం ఉంది అని మార్కెట్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.