ఉత్తరప్రదేశ్ లోని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రాంతం అంతా భారీ వర్షాలకు నీట మునిగింది. విమానాశ్రయం టెర్మినల్ కు వెళ్లే మార్గంతో పాటు పార్కింగ్ ఏరియా లోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. దీంతో విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించి ఆరు నెలలు కూడా కాకముందే ఈ పరిస్థితి ఏర్పడటంతో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని జేవర్ వద్ద అభివృద్ధి చేసిన ఈ ఎయిర్ పోర్టు ను 2026 మార్చి 28 న ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు జూన్ 15 నుంచి స్టార్ట్ అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఈ ఎయిర్ పోర్టు తొలిదశను 11200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి చేశారు. ఏటా 1 .20 కోట్ల మంది ప్రయాణించేందుకు వీలుగా దీన్ని అభివృద్ధి చేశారు. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ విమానాశ్రయంలో డ్రైనేజీ సిస్టం పని చేసేది ఇలాగేనా...ఇది ఎయిర్ పోర్టా లేక సీ పోర్టా అంటూ ప్రయాణికులు విమర్శలు చేస్తున్నారు. నీట మునిగిన నోయిడా ఎయిర్ పోర్టు ఫోటోలు..వీడియో లు సోషల్ మీడియా లో ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి.

                                   Full Viewవర్షం నీరు పెద్ద ఎత్తున చేరటంతో ప్రయాణికులు లోపలకి వెళ్లేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకే చోట ప్రయాణికులు ఎయిర్ పోర్టు తో పాటు సీ పోర్టు కూడా చూడొచ్చు అంటూ ఒక ప్రయాణికుడు వ్యాఖ్యానించారు. ఎయిర్ పోర్టు అధికారులు మాత్రం ఈ పరిస్థితి తాత్కాలికమే అని...విమాన సర్వీస్ లకు ఎలాంటి ఆటంకం కలగలేదు అని తెలిపారు. అర్ధగంటలోనే నీటిని పూర్తిగా తొలగించాం అని..ఎలాంటి సమస్యలు లేకుండా విమాన సర్వీసులు నడుస్తున్నాయి అని వెల్లడించారు. అయితే తాజా పరిణామాలపై రాజకీయ విమర్శలు మొదలు అయ్యాయి. నోయిడా ఎయిర్ పోర్టు లో విమానాలు తిప్పుతారా...లేక బోట్లా అంటూ సమాజ్ వాది పార్టీ అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం ఎక్కడ ఉన్నా భారీ అవినీతి కూడా ఉంటుంది అంటూ ఎక్స్ లో విమర్శలు గుప్పించారు. ఆప్ కూడా నీటమునిగిన ఎయిర్ పోర్టు ప్రాంతానికి చెందిన ఫోటో లు షేర్ చేస్తూ బీజేపీ సర్కారుపై విమర్శలు చేసింది. జురిచ్ ఎయిర్ పోర్టు ఇంటర్నేషనల్ ఏజీ కి చెందిన వంద శాతం అనుబంధ సంస్థ యమునా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ ఈ నోయిడా ఎయిర్ పోర్టును అభివృద్ధి చేసింది.

Tags: