హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా నుంచి మనాలి వెళ్లే మార్గమధ్యంలో ఉండే ప్రముఖ ఆలయాల్లో బగలాముఖి ఆలయం ఒకటి. ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నట్లు ఎక్కువ మంది విశ్వసిస్తారు. ఆలయానికి ఉన్న ప్రాముఖ్యతతో పాటు ఇది ఉన్న ప్రాంతం కూడా బగలాముఖి ఆలయానికి ఒక ప్రత్యేకత తెచ్చిపెట్టింది అని చెప్పాలి. ఈ ప్రాంతం బియాస్ నదికి సమీపంలో ఉన్న సుందరమైన కాంగ్రా లోయకు అనుకుని ఉండటంతో ఈ ఆలయానికి ఇప్పుడు పర్యాటకులు..సందర్శకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఈ కాంగ్రా లోయ నుంచి బగలాముఖి ఆలయానికి కనెక్ట్ చేసేలా కేబుల్ కారు సౌకర్యం ఏర్పాటు చేయటంతో ఇది అటు భక్తులతో పాటు పర్యాటకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లా బంఖండి ప్రాంతంలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం ఇది. ఈ ఆలయంలో హిందూ దేవత అయిన బగలాముఖి దేవి కొలువు తీరి ఉంటారు.
ఆమె తంత్ర సంప్రదాయంలోని దశ మహావిద్య దేవతల్లో ఒకరుగా చెపుతారు. పీతాంబర దేవిగా కూడా ప్రసిద్ధి చెందిన ఈ అమ్మవారు పసుపు రంగుతో ప్రత్యేక సంబంధం కలిగి ఉంటారు. అందుకే ఈ దేవాలయం అంతా కూడా ఎక్కువ భాగం పసుపు రంగులోనే ఉంటుంది. ఆమెకు మూడు కళ్ళు ఉండటం, భక్తులకు పరమ జ్ఞానాన్ని ప్రసాదించే శక్తికి ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా దేవీ ఆరాధనకు ప్రాధాన్యం ఉన్న నవరాత్రి పండుగ సమయంలో ఈ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దేశంలో బగలాముఖి దేవికి అంకితమైన చారిత్రక ప్రాధాన్యం గల మూడు ప్రధాన ఆలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయంలో బగలాముఖి దేవిని ఆరాధిస్తే భక్తులకు శక్తి పెరిగి, శత్రువుల బలం తగ్గిపోతుందని విశ్వసిస్తారు. శత్రువులను నిర్వీర్యం చేసే దైవ శక్తిగా ఆమెను భావిస్తారు.