వరస సంకేతాలు పంపుతున్న సందేశం అదేనా!

Update: 2026-06-27 13:45 GMT

Full Viewకేంద్రంలోని మోడీ...బీజేపీ సర్కారు డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందా?. వరసగా చోటు చేసుకుంటున్న సంఘటనలు ఇవే సంకేతాలు ఇస్తున్నాయా? అంటే అవుననే చర్చ సాగుతోంది. దేశంలోని దిగ్గజ మీడియా సంస్థలు అన్నీ అసలు దేశంలో మోడీ ని ఢీకొట్టేవాళ్లే లేరు అని చెపుతూ వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన బీజేపీ నే గెలుస్తూ వస్తోంది. ఏ రాజకీయ పార్టీకి అయినా కూడా గెలుపే ప్రామాణికం అన్న సంగతి తెలిసిందే. ఆ గెలుపుపై ఎన్ని విమర్శలు ఉన్నా..ఆరోపణలు ఉన్నా కూడా గెలుపే లెక్క. ఆ విషయంలో బీజేపీ దేశంలో వరస విజయాలతో దూసుకువెళుతుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. దేశంలో అయినా ..రాష్ట్రంలో అయినా సుదీర్ఘ కాలం ఒకే పార్టీ అధికారంలో ఉంటే ఎన్నో అనర్ధాలు చోటుచేసుకుంటాయి అనే విషయం ఎన్నో సార్లు రుజువు అయింది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ తెలంగాణనే. తెలంగాణ తెచ్చిన పార్టీ గా బిఆర్ఎస్ కు ప్రజలు రెండు సార్లు అధికారం అందించారు. దీంతో తెలంగాణ తెచ్చిన తమదే తెలంగాణ రాష్ట్రం కూడా అన్న చందంగా ఆ పార్టీ అగ్రనేతలు వ్యవహరించటంతో ప్రజలు బిఆర్ఎస్ ను అధికారానికి దూరం చేశారు. ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కారు కూడా పుష్కర కాలాన్ని పూర్తి చేసుకుంది.

                                  గతంలో ఎన్నడూ లేని రీతిలో కేంద్రంలోని మోడీ సర్కారు లో అధికారాల కేంద్రీకరణ కేవలం ఇద్దరు..ముగ్గురు చేతుల్లోనే ఉంది అనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మోడీ ఫస్ట్ టర్మ్ నుంచే ఇదే మోడల్ నడుస్తోంది. అయినా మంత్రులు... ఎంపీలు ఎవరూ నోరు తెరిచే సాహసం చేయటం లేదు. ప్రజలు ప్రభుత్వాల్లో అవినీతిని సహిస్తారు కానీ..తాము ఎంతో గట్టిగా నమ్మే దేవాలయాల్లో అవినీతిని ఏ మాత్రం ఉపేక్షించరు. ఎందుకంటే ఇది మనోభావాలతో కూడా అంశం. రాముడు అంటే బీజేపీ...బీజేపీ అంటే రాముడు అన్న తరహాలో ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకున్నారు దాని ద్వారా పెద్ద ఎత్తున రాజకీయ ప్రయోజనం కూడా పొందారు. కానీ ఇప్పుడు అదే అయోధ్య రామాలయంలో భక్తులు ఇచ్చిన కానుకలతో పాటు పెద్ద ఎత్తున విరాళాలు పక్కదారి పట్టాయనే వార్తలు కచ్చితంగా కేంద్రంలోని మోడీ సర్కారు కు పెద్ద షాక్ వంటిదే అని చెప్పాలి. ఇలా దారి మళ్ళిన నిధులు కోట్ల రూపాయల్లో ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఇవే కాకుండా అయోధ్య పేరుతో ట్రస్ట్ లోని సభ్యులు కూడా ఎన్నో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

                                   ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు చెపుతున్నా కూడా ఈ విషయంలో బీజేపీకి జరిగే డ్యామేజ్ ఎక్కువే ఉంటుంది అనే అంచనాలు ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం బ్యారేజ్ లో పగుళ్లు బయటపడినట్లు ఇప్పుడు వరుసగా అయోధ్య విరాళాల దోపిడీ..నీట్ పేపర్ లీక్ వంటి అంశాలు మోడీ సర్కారు ప్రతిష్టకు మచ్చ తెచ్చేవే. మరో వైపు మధ్య ప్రదేశ్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఫ్యామిలీకి చెందిన సంస్థలు ఏకంగా 168 ఎకరాలు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రం అయిన మహారాష్ట్రలో మరో పేపర్ లీక్ జరిగినట్లు వార్తలు బయటకు వచ్చాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)ను వాయిదా వేసింది. మరో వైపు కేంద్రంలోని మోడీ సర్కారు తన ఎజెండా పూర్తి చేసుకోవటానికి అవసరం లేకపోయినా కూడా దేశంలోని కీలక ప్రాంతీయ పార్టీలు అన్నిటిని చీల్చుకుంటూ పోవటంతో ఆ పార్టీపై ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పేపర్ లీకులు..ప్రజా సమస్యలను పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వం ఎంతసేపూ రాజకీయాలపైనే దృష్టి పెడుతుంది అనే విమర్శలు ఉన్నాయి. అధికారంలో ఉన్న వాళ్ళను ప్రతిపక్షాలు అడ్డుకోలేకపోతే ఆ పని ప్రకృతి చేస్తుంది అని...ఇప్పుడు బీజేపీ విషయంలో అదే జరుగుతుంది అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి చూడాల్సిందే.

Tags:    

Similar News