అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఎన్ని సార్లు బెదిరించినా ఇరాన్ మాత్రం దారికి రావటం లేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత వాతావరణం ఎప్పుడు తొలగిపోవుతుందో ఎవరికీ అంతు చిక్కటంలేదు. ఇప్పటికే భారీగా పెరిగిన ఆయిల్ రేట్లతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు ఇరాన్ కొత్తగా మరో ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది. అది అమలు చేస్తే మరిన్ని తిప్పలు తప్పవనే ఆందోళన వ్యక్తం అవుతోంది. గతంలో కూడా ఇరాన్ ఈ అంశంపై హెచ్చరికలు జారీ చేసింది. హర్ముజ్ జలసంధిలో అమెరికా-ఇజ్రాయెల్ లు యుద్ధం మొదలు పెట్టనంతవరకు ఉచితంగా నౌకల రవాణాకు అనుమతి ఉన్న విషయం తెలిసిందే.
యుద్ధం కారణంగా ఇరాన్ పునర్నిర్మాణం కోసం ఈ జలసంధిలో ప్రయాణించే నౌకలు చార్జీలు చెల్లించాల్సిందే అంటూ ఇరాన్ అధికారికంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కొత్తగా అమెరికా కంపెనీలకు షాక్ ఇచ్చేందుకు ఇరాన్ మరో ఎత్తుగడ వేసింది. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా అధికారికంగానే చెపుతోంది. హర్ముజ్ జలసంధి కింద ఉన్న సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుల్స్ పై అమెరికా సంస్థల నుంచి ఫీజు వసూలు చేయటానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు అమెరికా కంపెనీలు అంగీకరించకపోతే ఈ కేబుల్స్ కట్ చేయటానికి కూడా వెనకాడబోమని హెచ్చరిస్తోంది. ఒక వైపు డోనాల్డ్ ట్రంప్ తమతో వెంటనే ఒప్పందమే చేసుకోకపోతే ఇరాన్ లో ఏమి మిగలదు అని బెదిరిస్తుంటే...ఇప్పుడు ఇరాన్ సముద్రగర్భ కేబుల్స్ టార్గెట్ గా ప్లాన్స్ వేస్తోంది.
కేబుల్స్ పై ఇరాన్ పన్నులు వేస్తే మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాము అంతా సిద్ధం చేసిన తర్వాత ఏ కంపెనీ అయినా ఫీజులు చెల్లించటానికి నిరాకరిస్తే ఆయా సంస్థలు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని హెచ్చరిస్తోంది. అయితే ఈ విషయంలో స్పష్టత రావటానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సముద్ర గర్భ కేబుల్స్ విషయంలో ఇరాన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్ పై కూడా ఈ ప్రభావం భారీగానే ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ప్రపంచ వ్యాప్తంగా పలు కీలక దేశాలకు చెందిన కేబుల్స్ హర్ముజ్ జలసంధి కింద ఉన్నాయి.