అమెరికా ఒత్తిళ్లకు లొంగని ఇరాన్!

Update: 2026-04-20 12:35 GMT

యుద్ధం మళ్ళీ మొదలవుతుందా?. ఇదే ఇప్పుడు అందరిలో టెన్షన్ రేపుతున్న ప్రశ్న. దీనికి ప్రధాన కారణం ఇరాన్ తాము రెండవ దశ చర్చల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెపుతోంది. మరో వైపు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జె డీ వాన్స్ బృందం చర్చల కోసం పాకిస్థాన్ వెళుతుంది అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. అయితే హర్ముజ్ జలసంధి వేదికగా చోటు చేసుకున్న పరిణామాలు ఇరాన్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. మరో వైపు డోనాల్డ్ ట్రంప్ పూటకో మాట మారుస్తూ...ఏ మాత్రం సహేతుకం కానీ డిమాండ్లు తమ ముందు పెడుతున్నట్లు ఇరాన్ విమర్శలు చేస్తోంది. దీంతో ఇస్లామాబాద్ లో రెండవ దశ చర్చలు జరుగుతాయా లేదా అన్న అంశంపై ఇప్పుడు తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇరాన్ షిప్ ని అమెరికా సీజ్ చేయటం ..ఆ తర్వాత అమెరికా నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసినట్లు వచ్చిన వార్తలు ఒక్కసారిగా మళ్ళీ ఉద్రిక్తలు పెరగటానికి కారణం అవుతోంది.

                                    మరో వైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కూడా హర్ముజ్ జలసంధిని అమెరికా అడ్డుకోవటం ఏ మాత్రం సరికాదు అని చెపుతోంది. ఎందుకంటే ఈ జలసంధిని మూసివేయటం వాళ్ళ ఎక్కువగా నష్టపోతున్నది గల్ఫ్ దేశాలే అన్న సంగతి తెలిసిందే. ఒక వైపు అమెరికా-ఇజ్రాయెల్ లు చేసిన యుద్ధం కారణంగా ఏ మాత్రం సంబంధం లేకుండా నష్టపోయిన గల్ఫ్ దేశాలు ఇప్పుడు హర్ముజ్ విషయంలో అమెరికా వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇరాన్ రెండవ దశ చర్చలకు ఏ మాత్రం సుముఖంగా లేదు అని వార్తలు వస్తుండంతో చైనా కూడా రంగంలోకి దిగినట్లు చెపుతున్నారు. రెండు పక్షాలు చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని చైనా చెపుతోంది. చర్చల విషయంలో ఇరాన్ ఏ మాత్రం సుముఖంగా లేకపోవటంతో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా అమెరికా అధ్యక్షుడి డోనాల్డ్ ట్రంప్ తో ఫోన్ లో సంప్రదింపులు జరిపి హర్ముజ్ జలసంధిని అమెరికా అడ్డుకోవటంపైనే ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది అని చెప్పగా...తాను ఈ అంశంపై అలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం.

                                   కొద్ది రోజుల క్రితం డోనాల్డ్ ట్రంప్ మీడియా తో పాటు మాట్లాడుతూ తమ డిమాండ్లు అన్నిటికి ఇరాన్ అంగీకరించింది అని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా అంతా ఓకే అయితే ఇస్లామాబాద్ లో జరిగే ఒప్పందంపై సంతకాలు చేయటానికి తానే వెళతాను అని కూడా ప్రకటించారు. ఇరాన్ ఎంతో మంచి దేశం అని...గతం కంటే వాళ్ళు ఇప్పుడు ఎంతో మారిపోయారు అంటూ కూడా మాట్లాడారు. కానీ అసలు చర్చల దగ్గరకు వచ్చే సరికి ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమెరికా చేస్తున్న ఒత్తిళ్లకు ఇరాన్ ఏ మాత్రం లోగినట్లు కనిపించటం లేదు.

Tags:    

Similar News