యుద్ధం ఆగింది

Update: 2026-06-15 03:24 GMT

సస్పెన్స్ కు తెరపడింది. అమెరికా, ఇరాన్ ల మధ్య డీల్ కుదిరింది. ఇది గతంలో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఎన్నో సార్లు చెప్పినట్లు ఉత్తుత్తి డీల్ మాత్రం కాదు. ఎందుకంటే ఈ డీల్ విషయాన్ని ఇరాన్ కూడా అధికారికంగా ధ్రువీకరించింది. దీంతో గత మూడున్నర నెలల నుంచి పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పూర్తిగా తొలగిపోనున్నాయి. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఇంధన టెన్షన్ లకు కూడా ముగింపు రానుంది. ఇరాన్, అమెరికా ల మధ్య డీల్ కుదిరింది అన్న వార్తలతో ఇప్పటికే చమురు ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. మరో వైపు బంగారం, వెండి ధరలు దూసుకువెళుతున్నాయి. శాంతి ఒప్పందం ఖరారు విషయంలో ఖతార్ కీలక పాత్ర పోషించినట్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ఒప్పందం ఖరారుకు సహకరించిన దేశాలు అన్నిటికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. డీల్ ఓకే కావటంతో ఎలాంటి సుంకం లేకుండా హోర్ముజ్‌ జలసంధి వెంటనే తెరుచుకుంటుంది అని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ చెప్పారు.

                                       ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని సైన్యాన్ని ఆదేశించానని కూడా ఆయన వెల్లడించారు. అమెరికా నావికా దళ దిగ్బంధనం కూడా తొలగిస్తున్నట్టు చెప్పారు. ‘షిప్‌ల ఇంజన్లను స్టార్ట్‌ చేయండి, ఆయిల్‌ తరలించండి’ అంటూ ఉత్సాహంగా పిలుపునిచ్చారు. ఈ పరిణామాలపై ఇరాన్ కూడా స్పందించింది. అమెరికాతో అవగాహన ఒప్పందం కుదిరిందని ప్రకటించింది. యుద్ధం ముగించేందుకు ఒప్పందం కుదిరిందని తెలిపింది. ఇరాన్‌ డిప్యూటీ విదేశాంగ శాఖ మంత్రి ఘరీబా బాదీ ఈ ప్రకటన చేశారు. ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లో ఒప్పందంపై సంతకాలు చేస్తామన్నారు. డీల్‌ చేసుకున్నంత మాత్రాన శత్రువులను నమ్మినట్లు కాదని కూడా ఘరీబా బాదీ చెప్పారు. అమెరికా హామీలకు కట్టుబడి ఉంటుందో లేదో పరిశీలిస్తామని అన్నారు. ఈ ఒప్పందం నేపథ్యంలో లెబనాన్‌ సహా ఇతర ప్రాంతాల్లో మిలటరీ ఆపరేషన్స్‌ నిలిచిపోనున్నాయి. వాషింగ్టన్ తన వాగ్దానాలను పూర్తిగా నెరవేర్చినట్లు క్షేత్రస్థాయిలో నిర్ధారించుకున్న తర్వాతే.. తుది ఒప్పందం కోసం ప్రతిపాదించిన '60 రోజుల చర్చల కాలం' లోకి అడుగుపెడతామని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ న్యాయ, అంతర్జాతీయ వ్యవహారాల డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాదీ ఈ వివరాలను వెల్లడించారు.

                                     ఇరాన్ ప్రభుత్వ అనుబంధ 'ప్రెస్ టీవీ' తో ఆయన మాట్లాడుతూ, రాబోయే శుక్రవారం (జూన్ 19) స్విట్జర్లాండ్‌లో ఈ ఒప్పందంపై అధికారిక సంతకాల కార్యక్రమం జరుగుతుందని, ఆ తర్వాతే ఈ అవగాహన ఒప్పందం పూర్తి పాఠాన్ని బహిరంగపరుస్తామని చెప్పారు. ఈ ఒప్పందం దౌత్యం వల్ల మాత్రమే సాధ్యం కాలేదని, ఇరాన్ సాధించిన సైనిక విజయాలు, అమరవీరుల త్యాగాల వల్లనే శత్రువు లొంగివచ్చాడని ఘరీబాబాదీ వ్యాఖ్యానించారు. ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పిన శుద్ధి చేసిన యురేనియం విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. ఎట్టకేలకకు ఒప్పందం కుదరటంతో ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు పెద్ద ఊరట అనే చెప్పొచ్చు. ఎందుకంటే అమెరికా దాడి చేసిన ప్రతిసారి ఇరాన్ గల్ఫ్ దేశాలను...ఆ దేశాల్లోని అమెరికా బేస్ లను టార్గెట్ గా చేసుకుని దాడులు చేసిన సంగతి తెలిసిందే. అధికారికంగా ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News