రాజకీయ నాయకులు పార్టీలు మారటం సహజమే. కానీ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యక గుర్తింపు తెచ్చుకుని తాను కూడా అందరిలాంటి వాడినే అని సడన్ గా రంగు మారిస్తే ఇప్పటి యువత ఒప్పుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించటం లేదు. రాజ్యసభ లో వివిధ అంశాలపై స్పందించటం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు నిన్నటి వరకు ఆప్ ఎంపీగా ఉన్న రాఘవ చద్దా. ఇటీవల ఆయన్ను ఆప్ అధిష్టానం రాజ్యసభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తప్పించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక వైపు ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఆప్ ఇలా చేయటం ఏంటి అంటూ కూడా చాలా మంది అవాక్కు అయ్యారు కూడా. అయితే ఆప్ మాత్రం రాఘవ చద్దా అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయని గ్రహించే ఈ నిర్ణయం తీసుకుంది అనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. రాఘవ చద్దా శుక్రవారం నాడు తాను వెళ్ళటమే కాకుండా మరో ఆరుగురు రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి తీసుకెళ్లారు. అంతకు ముందు ఆప్ రాజ్యసభ పక్షాన్ని బీజేపీ లో విలీనం చేస్తున్నట్లు వాళ్ళ సంతకాలతో కూడిన లేఖను రాజ్య సభ చైర్మన్ కు అందచేశారు.
అప్పటి నుంచి దేశ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు రాఘవ చద్దా బీజేపీలో చేరిన వెంటనే ఆయన ఆప్ లో ఉండగా..బీజేపీ ని ఉద్దేశించి గతంలో మాట్లాడిన మాటలతో కూడిన వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. బీజేపీ చదువురాని గుండాల పార్టీ అంటూ ఆయన గతంలో విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆయన అదే పార్టీ లో చేరారు. దీంతో రాఘవ చద్దా కూడా అందరిలాంటి రాజకీయ నాయకుడిగా మారాడు తప్ప....ఆయనలో ఏమి ప్రత్యేకత లేదు అని నిరూపించుకున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన బీజేపీ లో చేరినప్పటి నుంచి ముఖ్యంగా జెన్ జీ యువత ఆయనకు షాక్ ఇవ్వటం స్టార్ట్ చేశారు. అది ఎలా అంటే ఆయన కు ఇన్ స్టాగ్రామ్ లో పెద్ద ఎత్తున ఫాలోవర్లు ఉన్నారు. ఆయన బీజేపీ లో చేరిన 24 గంటల్లోనే ఏకంగా ఆయన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లోని ఫాలోవర్ల సంఖ్య ఏకంగా పది లక్షల కు పైగానే తగ్గింది. దీంతో ఆయన నిర్ణయం యువతకు ఏ మాత్రం నచ్చలేదు అని అర్ధం అవుతోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఎంపీకి ఇన్ స్టాగ్రామ్‌లో 14.6 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. శుక్రవారం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఆ సంఖ్య 13.5 మిలియన్లకు తగ్గింది.
రాఘవ చద్దా నిర్ణయాన్ని జెన్ జీ బ్యాచ్ వ్యతిరేకించడమే దీనికి కారణమై ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక చద్దాకు ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోయింగ్ తగ్గిపోవడంపై ఎన్సీపీ(ఎస్పీ) అధికార ప్రతినిధి అనీశ్ గవాండే స్పందించారు. ఇంటర్నెట్ మిమ్మల్ని రాత్రికి రాత్రే హీరోగా మారుస్తుంది.. అలాగే ఓవర్ నైట్‌లోనే జీరోకి కూడా పడేయగలదని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని బీజేపీ అభిమానులు అంతా ఆయన్ను ఫాలో అవుతారు అంటూ కూడా కొంత మంది సోషల్ మీడియా లో స్పందిస్తున్నారు. అయితే ఇందులో ఒక్కటి మాత్రం నిజం... రాఘవ చద్దా పార్టీ మార్పు నిర్ణయం ఎక్కువ మందికి నచ్చలేదు అనే విషయం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.