ఒకప్పుడు ప్రభుత్వం ఏదైనా చెప్పింది అంటే ఇక దానికి తిరుగు ఉండేది కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు దొంగలెక్కలు చెప్పవు అని ఎక్కువ మంది ప్రజలు నమ్మేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం చెప్పే మాటలకు కూడా విశ్వసనీయత లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాలు చేసిన అప్పుల విషయమే చూస్తే టీడీపీ చెప్పేవాటిని వైసీపీ ఒప్పుకోదు...వైసీపీ చెప్పేవాటిని టీడీపీ ఒప్పుకోదు. తెలంగాణాలో కూడా అంతే. అధికార కాంగ్రెస్ పార్టీ ఒక లెక్క చెపుతుంది....ప్రతిపక్ష బిఆర్ఎస్ మరో లెక్క చెపుతుంది. ఈ రచ్చ ఎన్నో సంవత్సరాలుగా సాగుతూనే ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) లెక్కల విషయంలో కూడా గోల్ మాల్ చేసింది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవి ఏదో బీజేపీ పై ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ చేసి ఉంటే రాజకీయ విమర్శలు అని సరిపెట్టుకోవచ్చు. కానీ కేంద్రం ప్రకటించిన జీడీపీ లెక్కలపై ఏకంగా ఆర్ బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ సందేహాలు వ్యక్తం చేశారు.
ఆయన ఒక్కరే కాదు కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ గార్గ్ కూడా కేంద్రం ప్రకటించిన లెక్కలపై అనుమానాలు వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ సర్కారు చెపుతున్నట్లు 2026 ఏప్రిల్- జూన్ లో జీడీపీ వృద్ధి రేట్ 7 .8 శాతం ఉండి ఉంటే ...ఆ మేరకు దేశంలో ఆ మేర ఉద్యోగ అవకాశాలు ఎందుకు పెరగలేదు...ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడులు ఎందుకు అంత తక్కువగా ఉన్నాయని సందేహాలు లేవనెత్తారు. దేశీయంగా వ్యాపార విస్తరణ కూడా ఎంతో మందకొడిగా సాగుతుంది అని తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ గార్గ్ అయితే ప్రభుత్వం చెపుతున్నట్లు జీడీపీ వృద్ధి రేట్ 7 .8 శాతం కాదు అని..కేవలం 2 .6 శాతం మాత్రమే అని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. అయితే సుభాష్ గార్గ్ వాదనలను కేంద్రం తోసిపుచ్చుతోంది. ఒక వైపు గత ఆరు నెలలుగా పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఇంధన ధరలు పెరిగి దేశంలోని పలు రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం అంచనాలకు మించి దేశ జీడీపీ వృద్ధి రేట్ నమోదు అయింది అని చెప్పటం చాలా మందిని విస్మయానికి గురిచేసింది. మరో వైపు గత కొన్ని నెలలుగా అన్ని ఉత్పత్తుల ధరలు పెరిగి ద్రవ్యోల్భణం కూడా పెరుగుతూ పోతోంది. అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగటంతో పాటు పలు రంగాలకు చెందిన సప్లయ్ చైన్ లు కూడా దెబ్బతిని ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అయినా కూడా సంక్షోభాన్ని అధిగమించి భారత్ రికార్డు స్థాయిలో జీడీపీ వృద్ధి సాధించింది అని విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఒక వీడియో ద్వారా హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ జీడీపీ లెక్కలు వాస్తవ ప్రగతి కంటే...లెక్కించే విధానంలో చేసిన మార్పుల వల్ల మాత్రమే సాధ్యం అయింది అని కొంత మంది అధికారులు చెపుతున్నారు. కేంద్రం ప్రకటించిన జీడీపీ లెక్కలు బోగస్ అన్న చందంగా అటు కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ గార్గ్ తో పాటు ఆర్ బిఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ లు ప్రకటనలు చేయటంతో ప్రజల్లో కూడా పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించటం స్టార్ట్ చేసింది. తమకు అధికారాన్ని అప్పగిస్తే నల్లధనాన్ని అరికడతాం...విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ ని వెనక్కి తెస్తాం అని ప్రకటించిన బీజేపీ ఇప్పుడు చివరకు జీడీపీ లెక్కల విషయంలో కూడా లేని గొప్పలు చెపుతూ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమానికి దిగినట్లు ఉంది అనే చర్చ సాగుతోంది.