అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టెన్షన్ లో ఉన్నారా?. ఇరాన్ ఎలాగైనా తనను టార్గెట్ చేస్తుంది అని భయపడుతున్నారా?. తాజా పరిణామాలు చూస్తుంటే ఇవే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డోనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే ఇరాన్ నంబర్ వన్ టార్గెట్ తానే అని ప్రకటించుకున్నారు. ఒక వేళ ఇరాన్ తన హత్యకు ప్రయత్నిస్తే ఏమి చేయాలో తాను ఇప్పటికే అధికారులకు చెప్పినట్లు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించటంతో ఇరాన్ విషయంలో ట్రంప్ ఎంత టెన్షన్ గా ఉన్నారో అర్ధం అవుతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీ హత్య చేయటం...మళ్ళీ ఆయన అంత్య క్రియల సమయంలో కూడా అమెరికా పలు ప్రాంతాల్లో దాడులు చేయటంతో ఇరాన్ పాలకులే కాకుండా ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ట్రంప్ పై ప్రతీకారం తీర్చుకోవాలని అయతుల్లా అలీ ఖొమైనీ అంత్యక్రియల సమయంలో కొంత మంది ప్రజలు నినాదాలు కూడా చేసినట్లు మీడియా లో వార్తలు వచ్చాయి. ఇవి అన్నీ చూసే డోనాల్డ్ ట్రంప్ ఆందోళనకు గురి అవుతున్నట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. మరో వైపు ఇరాన్ కు ట్రంప్ మరో సారి తీవ హెచ్చరికలు పంపారు. ఇరాన్ టార్గెట్ గా ఇప్పటికే వెయ్యి క్షిపణులను లోడ్ చేసి పెట్టామని..తన హత్యకు ప్రయత్నిస్తే ఇరాన్ పై క్షిపణుల వర్షం తప్పదు అన్నారు. ఈ మేరకు సైన్యానికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
పైకి చెప్పకుండా హర్ముజ్ పై పట్టు సాధించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు ఒమన్ సహకారంతో ఈ జలమార్గంలో కొత్త రూట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కారణంతోనే ఇరాన్ నౌకలపై దాడులు చేయటం...వీటికి ప్రతీకారంగా అమెరికా వరసగా ఇరాన్ పై దాడులకు దిగిన విషయం తెలిసిందే. మరో వైపు హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్‌ను అమెరికా హెచ్చరించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. హర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాయానానికి పూర్తిగా తెరిచి ఉంటుందని, వాణిజ్య నౌకలపై ఎలాంటి దాడులూ జరగవని 24 గంటల్లోగా ఇరాన్ బహిరంగంగా ప్రకటించాలని వాషింగ్టన్ స్పష్టం చేసినట్టు సమాచారం. లేనిపక్షంలో తీవ్రమైన సైనిక, ఆర్థిక చర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరించినట్టు తెలుస్తోంది.