మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం

Update: 2026-05-28 08:52 GMT

Full Viewడీ కె శివకుమార్ కల నెరవేరబోతోంది. ప్రస్తుతం కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అయన త్వరలోనే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోనున్నారు. అధిష్టానం ఆశీస్సులతో ఆయనకు ఈ కీలక పదవి దక్కనుంది. కర్ణాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావటంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల తర్వాత అధిష్టానం కూడా ఒక ఫార్ములా సిద్ధం చేసి ఫస్ట్ సీఎం గా సిద్దరామయ్యను నియమించి రెండున్నర సంవత్సరాల తర్వాత డీ కె శివకుమార్ కు ఛాన్స్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ ఒప్పందంలో భాగంగానే అధికార మార్పిడి జరుగుతోంది. అయితే ఇది అంతా సాఫీగా ఏమి సాగలేదు అనే చెప్పాలి. సీఎం పీఠంపై కూర్చున్న తర్వాత సిద్దరామయ్య మధ్యలో చాలా సార్లు తానే ఐదేళ్లు సీఎం గా ఉంటానని...సీఎం పోస్ట్ విషయంలో ఎలాంటి ఒప్పందాలు లేవు అంటూ కూడా ప్రకటించారు. ఇదే అంశంపై చాలా సార్లు రచ్చ కూడా సాగింది. ఫైనల్ గా కాంగ్రెస్ అధిష్ఠానం కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత కర్ణాటక ప్రభుత్వంలో అనిశ్చితికి తెరదించాలని వేగంగా నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే సిద్దరామయ్య తో రాజీనామా చేయించి డీ కె శివకుమార్ ను సీఎం చేయాలని నిర్ణయం తీసుకుంది.

                                అందుకు అనుగుణంగా గురువారం నాడు కర్ణాకటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన నివాసంలో మంత్రులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ పెట్టుకుని తన రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించారు. అదే సమయంలో కొత్త సీఎం గా డీ కె శివ కుమార్ బాధ్యతలు స్వీకరిస్తారు అనే విషయాన్ని కూడా తేల్చేశారు. కేబినెట్‌ను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు.అల్పాహార విందు సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. ముఖ్యమంత్రి సిద్దరామయ్య కు పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత ఆయనను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. సిద్దరామయ్య రాజీనామా లేఖను సమర్పించటం కోసం ఇప్పటికే గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు. ఈ రోజు ఉదయం ఆయన తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించడానికి సిద్ధమయ్యారు. అయితే గవర్నర్ అందుబాటులో లేరు. బుధవారం రాత్రి 10:30 గంటలకు ఆయన ముంబై వెళ్లినట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సిద్దరామయ్య గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించనున్నారు.

                                 సిద్దరామయ్యను రాజీనామా చేయాలని కోరిన కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనకు పలు ఆఫర్లను ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. రాజ్యసభ టికెట్‌ ఇస్తామని, జాతీయ రాజకీయాల్లోకి రావాలని సూచించినట్లు సమాచారం. దీంతో పాటు సిద్దరామయ్య కుమారుడు యతీంద్రకు క్యాబినెట్‌లో చోటు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చినట్లు చెపుతున్నారు. రాజీనామా అనంతరం సిద్దరామయ్య మరో సారి ఢిల్లీ వెళతారని చెపుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఈ సమయంలో ముఖ్యమంత్రి మార్పు నిర్ణయం తీసుకోవటం వెనక కూడా వ్యూహం ఉంది అని చెపుతున్నారు. రాజకీయంగా మంచి ఆర్గనైజర్ అయిన డీకే శివకుమార్ సీఎం గా వచ్చే ఎన్నికలకు వెళ్లి మరో సారి కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Tags:    

Similar News