ఓడించటమే కాదు..ఉనికి కూడా లేకుండా చేయాలా!

Update: 2026-06-10 12:23 GMT

Full Viewఏ రాజకీయ పార్టీ అయినా సరే తన ప్రత్యర్థి పార్టీని ఓడించి అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. ప్రతి చోటా ఇదే జరుగుతుంది. ఇందుకు సర్వ శక్తులు ఒడ్డుతుంది కూడా. కానీ దేశంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది . ప్రత్యర్థి పార్టీని..అధికారంలో ఉన్న పార్టీని ఓడించటంతో తృప్తి చెందని రాజకీయ నాయకులు...అసలు తమ ప్రత్యర్థి పార్టీ ఉనికిలో కూడా లేకుండా చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ఈ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది అనే చెప్పాలి. మొదట ఢిల్లీ లో బీజేపీ ఈ మోడల్ అమలుకు శ్రీకారం చుట్టింది. లిక్కర్ స్కాం పేరుతో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ని ఓడించింది. ఏకంగా అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ని జైలులో వేసి కొత్త రికార్డు కూడా సృష్టించింది. ఆ తర్వాత ట్రయల్ కోర్ట్ అసలు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు అంతా ఊహలతో నిర్మించింది తప్ప...దీన్ని నిరూపించే ఆధారాలు ఏమి లేవు అంటూ తేల్చిచెప్పింది. దీనిపై సిబిఐ అప్పీల్ చేసింది ..ఇప్ప్పుడు కేసు ఢిల్లీ హై కోర్ట్ లో పెండింగ్ లో ఉంది. ఈ లోగా ఆప్ కు చెందిన పది మంది రాజ్య సభ సభ్యుల్లో ఏడుగురిని చీల్చి వాళ్ళను బీజేపీ లో చేర్చుకున్న విషయం తెలిసిందే. రాఘవా చద్దా తో పాటు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్బజన్ సింగ్, స్వాతి మాలివాల్ తదితరులు ఇందులో ఉన్నారు.

                                   రాజ్య సభ లో ఆప్ కథను అలా ముగించారు. ఇప్పడు మొన్నటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో దారుణంగా ఓటమి చవిచూసిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టిఎంసి) ఉనికే లేకుండా చేసేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పావులు కదుపుతోంది. ఆ పార్టీ ఎంపీల్లో చీలికకు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఎంపీ సీఎం రమేష్ కీలక పాత్ర పోషించినట్లు మీడియా లో కూడా వార్తలు వచ్చాయి. పైకి కనిపించేది కొంత మంది అయినా తెరవెనక ఎలాగూ బీజేపీ పెద్దలు ఉండనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో టిఎంసి తరపున 80 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. పార్టీ ఓటమి పాలు అయిన తర్వాత మెజారిటీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేసి రితబ్రత బందోపాధ్యాయ్ తమ పక్ష నాయకుడిగా స్పీకర్ కు లేఖ ఇవ్వటం..స్పీకర్ గుర్తించటం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి సీన్ ఢిల్లీ కి మారింది. లోక్ సభలో టిఎంసి 28 మంది ఎంపీలు ఉంటే...ఇటీవల 20 మంది ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగరేసి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నట్లు స్పీకర్ కు లేఖ ఇచ్చారు. దీంతో అటు ఎమ్మెల్యేలే కాదు...ఎంపీలు కూడా పార్టీ వీడటానికి సిద్ధం అయ్యారు.

                                 మరో వైపు ఇప్పటికే టిఎంసి కి చెందిన ఇద్దరు రాజ్య సభ సభ్యులు కూడా తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇంకా ఎంత మంది రాజీనామాల బాట పడతారో ఎవరికీ తెలియదు. ఈ తరుణంలో ఢిల్లీ వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ ని తట్టుకుని ఇప్పుడు మమతా బెనర్జీ ఒంటరిగా పోరాడటం సాధ్యం అయ్యే పని కాదు అని గ్రహించి కాంగ్రెస్ లో పార్టీ ని విలీనం చేసే దిశగా ముందుకు సాగుతున్నట్లు జాతీయ మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ లో సోనియా గాంధీ తో మమతా బెనర్జీ భేటీ కావటం...ఆ తర్వాత రాహుల్ గాంధీ తో మమతా మేనల్లుడు...ఎంపీ అభిషేక్ బెనర్జీ సమావేశం కావటంతో ఒక్క సారిగా కాంగ్రెస్ లో టిఎంసి విలీనం వార్తలు ఊపు అందుకున్నాయి. విలీనం తర్వాత మమతా బెనర్జీ కి కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పదవి...అభిషేక్ బెనర్జీ కి జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ లో టిఎంసి విలీనం చేస్తే తప్ప ఉనికి మిగలటం కష్టం అనే అభిప్రాయానికి వచ్చే మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ నాయకురాలుగా ఉన్న మమతా తర్వాత టిఎంసి పార్టీని ఏర్పాటు చేసి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గా 15 సంవత్సరాల పాటు పాలించిన సంగతి తెలిసిందే. ఆమె పాలనపై వచ్చిన విమర్శలు కూడా అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు ఆమె తిరిగి కాంగ్రెస్ వైపు చూడటం కీలక పరిణామంగా చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున టిఎంసి..కాంగ్రెస్ లో విలీనం అవుతుంది అని ప్రచారం జరుగుతున్న  వేళ ఈ వార్తలను టిఎంసి తోసిపుచ్చుతోంది. ఇవి కేవలం పుకార్లు మాత్రమే అని ఆ పార్టీ కొట్టి పారేస్తోంది.  

Tags:    

Similar News