ప్రముఖ పర్యాటక దేశాల్లో వరసగా చోటు చేసుకుంటున్న దుర్ఘటనలు కలకలం రేపుతున్నాయి. వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 15 మంది మృతువాత పడిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల నుంచి వియత్నాంకు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లు అందుబాటులోకి రావటం ...ఆ దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు కూడా పలువురిని ఆకర్షిస్తున్నాయి. వియత్నాం బోట్ ప్రమాదం ఘటన మరవక ముందే ఇప్పుడు తాజాగా మరో ప్రముఖ పర్యాటక ప్రాంతం అయిన థాయిలాండ్ లోని బ్యాంకాక్ బార్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. . ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందగా.. 63 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని అధికారులు చెపుతున్నారు. ఆదివారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది.
చతుచక్ ప్రాంతంలోని 'రోంగ్ బీర్ నా లాడ్‌ప్రావ్' పబ్‌లో ఆదివారం రాత్రి 11:57 గంటల సమయంలో.. లైవ్ బ్యాండ్ సంగీత ప్రదర్శన ఇస్తుండగా వేదిక సమీపం నుంచే ముందు పొగలు వచ్చాయి. ఆ వెంటనే పబ్‌లో కరెంట్ పోవటంతో అంతా గందరగోళం ఏర్పడింది. ఆ తర్వాత క్షణాల్లోనే పెద్ద పేలుడు సంభవించటం.... వేదిక ముందు భాగం నుంచి మంటలు వేగంగా వ్యాపించటంతో పబ్ లోపల ఇంటీరియర్ డెకరేషన్ కోసం వాడిన వస్తువుల కారణంగా సీలింగ్ ద్వారా మంటలు అత్యంత వేగంగా పబ్ అంతటా వ్యాపించి ఎక్కువ మంది మరణాలకు కారణం అయినట్లు చెపుతున్నారు.
పబ్ అత్యవసర ద్వారాల వద్ద స్టాళ్లు, టేబుళ్లు ఏర్పాటు చేయడం వల్ల పబ్ కు ఎంజాయ్ చేద్దాం అని వచ్చిన వాళ్ళు ఈ ప్రమాద సమయంలో బయటకు రాకుండా దారులు మూసుకుపోయాయి. దట్టమైన పొగ, చీకటి కారణంగా ప్రాణాలు కాపాడుకోవడానికి చాలా మంది పబ్ వెనుక భాగంలో ఉన్న రెస్ట్‌రూమ్‌ల వైపు పరుగెత్తగా...అక్కడ ఎలాంటి అత్యవసర ద్వారాలు లేకపోవడంతో పొగ కారణంగా ఊపిరాడక ఎక్కువ మంది బాత్‌రూములలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి అనుతిన్ చర్నవిరకుల్ సంఘటనా ప్రాంతాన్ని సందర్శించారు. పబ్ నిబంధనలను పాటిస్తోందా? లేదా అనే అంశంపై పూర్తి స్థాయి ఫోరెన్సిక్ దర్యాప్తునకు ప్రధాన మంత్రి ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.