జులై ఆరున ట్రస్ట్ కీలక సమావేశం

Update: 2026-07-03 07:44 GMT

గత కొన్ని రోజులుగా అయోధ్య రామాలయంలో విరాళాల దొంగతనం వ్యవహారం దేశ వ్యాప్తం గా దుమారం రేపుతోంది. దీనికి సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఒక్క విరాళాల విషయమే కాకుండా ప్రభుత్వ భూములను కూడా ప్రైవేట్ భూములు అని చెప్పి కొంత మంది కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే రకరకాల లెక్కలు బయటకు వస్తున్నా కూడా నిర్దిష్టంగా ఎంత మేర విరాళాలను దోచుకున్నారు అనే విషయంపై మాత్రం ఎక్కడా స్పష్టత లేదు. ఈ విషయం భవిష్యత్ లో కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. అయోధ్య రామాలయంలో విరాళాల దోపిడీ వ్యవహారం రాజకీయంగా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ఇది కేంద్రంలోని మోడీ సర్కారు ను రాజకీయంగా రాబోయే రోజుల్లో ఇరకాటంలోకి నెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాముడి పేరు చెప్పి ఓట్లు పొందటమే కాకుండా...రాముడి డబ్బులు దోపిడీకి గురైన కూడా కేంద్రంలోని పెద్దలు నోరు విప్పటంలేదు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన అంశం ప్రకారం చూస్తే ఈ కేసు ఏ మాత్రం ముందుకు సాగే అవకాశం లేదు అనే స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సుప్రీంకోర్టు అయోధ్య తీర్పు మేరకు ఏర్పాటు చేసిన స్వతంత్ర సంస్థ అని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఓ) స్పష్టం చేసింది.

                                     ఈ ట్రస్ట్‌కు కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందడం లేదని, అలాగే ఈ రెండు ప్రభుత్వాల పరిపాలనా నియంత్రణలో కూడా ఇది లేదని పేర్కొంది. కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) కి హోమ్ మంత్రిత్వ శాఖ గతంలో ఈ మేరకు స్పష్టం చేసినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్ అఫ్ ఇండియా వెల్లడించింది. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇతర దేవాలయాలకు చేసినట్లు కేవలం శాంతిభద్రతలు, క్రౌడ్ మ్యానేజ్మెంట్ వంటి బాధ్యతలను మాత్రమే చూసుకుంటుంది అని వెల్లడించారు. గత ఏడాది ఫిబ్రవరి 20న కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) కు సమర్పించిన నివేదికలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) ఈ ట్రస్ట్ తన నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకుంటుందని, పరిపాలనా అధికారాలన్నీ శాశ్వత ట్రస్టీలకే అప్పగించబడ్డాయని పేర్కొన్నట్లు టైమ్స్ అఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది.

                                       2024 ప్రారంభంలో ఆర్టీఐ దరఖాస్తుదారు నీరజ్ శర్మ ట్రస్ట్‌కు సంబంధించిన ప్రజా సమాచార అధికారుల వివరాలను కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఎంహెచ్‌ఏ ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో శర్మ 2024 ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సీఐసీ తన తుది ఉత్తర్వుల్లో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సుప్రీంకోర్టు అయోధ్య తీర్పు మేరకు ఏర్పాటు చేసిన స్వతంత్ర సంస్థ అని స్పష్టం చేసింది. ఈ ట్రస్ట్‌కు కేంద్ర ప్రభుత్వం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందడం లేదని, అలాగే ఈ రెండు ప్రభుత్వాల పరిపాలనా నియంత్రణలో కూడా ఇది లేదని పేర్కొంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై ఎలాంటి నియంత్రణ లేకపోతే ఇప్పుడు సిట్ ఏర్పాటు చేసి ఈ విరాళాల దోపిడీ విషయాన్నీ ఎలా విచారిస్తుంది అన్న ప్రశ్న ఉదయించకమానదు. జూలై 6న జరగనున్న అయోధ్య ట్రస్ట్ సమావేశంలో ఈ విరాళాల దోపిడీ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు కీలకంగా మారనుంది. ట్రస్ట్‌లో మొత్తం 15 మంది సభ్యులు ఉండగా, వారిలో నలుగురు ఎక్స్-ఆఫిషియో సభ్యులు ఉన్నారు. వీరికి ఓటు హక్కు ఉండదు.

Full View

Tags:    

Similar News