చుక్కలు చూపించిన ఎయిర్ మారిషస్ విమానం

Update: 2024-02-24 15:45 GMT

Full Viewవిమానం గాలిలో ఎగురుతున్నప్పుడు అందులో ఉన్న ప్రయాణికులకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ టేక్ ఆఫ్ కోసం అంతా సిద్ధం అయిన తర్వాత ఆ విమానం ఏకంగా ఐదు గంటలు ఎయిర్ పోర్ట్ లోనే నిలిచిపోతే అందులో ఉన్న ప్రయాణికుల ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. పోనీ వాళ్ళను కిందకు దిగనిస్తారా అంటే నిబంధనల ప్రకారం అందుకు అనుమతించరు. శనివారం తెల్లవారు జామున ముంబై నుంచి మారిషస్ వెళ్లాల్సిన విమానం టేక్ ఆఫ్ సమయంలో ఇంజిన్ లో సమస్యలు తలెత్తాయి. విషయాన్ని గ్రహించిన పైలట్ అక్కడే దాన్ని నిలిపి వేశారు. కానీ అందులోని ప్రయాణికులను మాత్రం బయటకు అనుమతించలేదు . ఆ సమయంలో విమానంలోని ఏసీలు కూడా పని చేయలేదు. దీంతో ఇందులో ఉన్న చిన్న పిల్లలతో పాటు వృద్దులు ఊపిరి ఆడక తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు.

                             ప్రయాణికుల్లో కొంత మంది ఊపిరి తీసుకోవటానికి కూడా ఇబ్బంది పడ్డారు. విషయం గ్రహించిన సిబ్బంది వెంటనే వాళ్ళను కిందకు దింపి చికిత్స అందించినట్లు ఇతర ప్రయాణికులు వెల్లడించారు. ఎయిర్ మారిషస్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం తెల్లవారు జామున 4 .30 గంటలకు బయలు దేరాల్సిన ఈ విమానంలోకి 3 .45 గంటలకు ప్రయాణికులను ఎక్కించారు. టేక్ ఆఫ్ సమయంలో ఇంజిన్ లో సమస్య తలెత్తింది. చివరకు ఈ సర్వీస్ ను రద్దు చేసి ప్రయాణికులను ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నం అయింది ఎయిర్ మారిషస్. గాలిలో ఎగరని విమానంలో ఐదు గంటలు పాటు కదలకుండా కూర్చోవటంతో చాలా మంది నరకం అనుభవించారు. ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు అంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనపై ఎయిర్ మారిషస్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

Tags:    

Similar News