ఢిల్లీ లిక్కర్ కేసు తీర్పు సంకేతాలు ఏంటి!

Update: 2026-02-27 12:53 GMT

కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు తమ రాజకీయ ప్రత్యర్థులను ఎలాంటి ఆధారాలు లేకపోయినా సరే కేసుల్లో ఇరికించి అరెస్ట్ లు చేయించగలరా?. వాళ్ళ రాజకీయ జీవితాన్ని తలకిందులు చేయగలరా అంటే ఇప్పుడు అవుననే సమాధానం వస్తోంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో శుక్రవారం నాడు ఢిల్లీ లోని రౌస్ అవెన్యూ కోర్ట్ ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు మరో సారి ఇదే చర్చను తెరమీదకు తెచ్చింది అని చెప్పాలి. ఈ కేసు కారణంగా దేశంలో తొలిసారి ఒక సిట్టింగ్ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావటంతో పాటు కొన్ని నెలల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అంతే కాదు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఓటమి కూడా చవిచూడాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఏ రాష్ట్రంలో అయినా కూడా అధికారంలో ఉన్న వాళ్లపై స్కాం ల ఆరోపణలు వచ్చినప్పుడు ఇవి అన్నీ రాజకీయ ఆరోపణలు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా వీటిని తేల్చాల్సింది కోర్ట్ లే. కొంత మంది నేతలు అయితే చట్టానికి చిక్కకుండా..పక్కాగా పనులు చేసుకుంటూ పోయే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి రౌస్ అవెన్యూ కోర్ట్ తన ఆదేశాల్లో పేర్కొన్న అంశాలు ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి.

                                        ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కు సంబంధించి కూడా సిబిఐ ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయింది అని స్పష్టం చేసింది. ఎలాంటి సరైన ఆధారాలు లేకుండానే వీళ్ళ పేర్లను కేసు లో చేర్చారు అని సిబిఐ పై కోర్ట్ ఆగ్రహం వక్తం చేసింది. అందుకే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తో పాటు తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ కుమార్తె కవిత లపై నమోదు అయిన కేసు లను కొట్టివేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం లో అభియోగాలు నమోదు అయిన మొత్తం 23 మందిని ఈ కేసు నుంచి విముక్తి కలిగించింది. ఈ కేసు విచారణ జరిపిన తీరుపై కోర్ట్ సిబిఐ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో విచారణ జరిపించాల్సింది సిబిఐ అధికారుల తీరుపై అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత తదితరులపై నమోదు అయిన కేసు కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు అని...కేవలం ఊహాగానాల ఆధారంగా ఇందులో కుట్ర జరిగింది అని సిబిఐ ఆరోపించింది కోర్ట్ పేర్కొంది. కోర్ట్ ఆదేశాల ప్రకారం చూస్తే సిబిఐ ఒక సీఎం, డిప్యూటీ సీఎం తో పాటు ఆప్ కీలక నేతలను ఇందులో ఇరికించినట్లు స్పష్టం అయినట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది.

                                 మరో వైపు సిబిఐ రౌస్ అవెన్యూ కోర్ట్ తీర్పుపై తాము హై కోర్ట్ లో అప్పీల్ చేస్తామని...తమ విచారణలోని అంశాలను ట్రయల్ కోర్ట్ పరిగణనలోకి తీసుకోలేదు అని చెపుతోంది. దీనిపై కూడా అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ట్రయల్ కోర్ట్ కు చూపించలేని ఆధారాలు..హై కోర్ట్..సుప్రీం కోర్ట్ లో ఏమి చూపిస్తారు అని ఎద్దేవా చేశారు. రౌస్ అవెన్యూ కోర్ట్ తీర్పు తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మీడియా తో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా లు రాజకీయంగా దెబ్బకొట్టేందుకే తమపై ఈ కేసు లు పెట్టించారు అని ఆరోపించారు. కోర్ట్ తీర్పుతో ఇదే విషయం బయటపడింది అన్నారు. ప్రభుత్వాలను కూల్చేందుకు ఇలాంటి పనులు చేయవద్దు అని కోరారు. తాము నిజాయపతిపరులం అని కోర్ట్ తీర్పుతో స్పష్టం అయింది అని..న్యాయాన్ని కాపాడిన కోర్ట్ కు ధన్యవాదాలు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ కంటతడి పెట్టారు. ఆ సమయంలో ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆయన్ను ఓదార్చారు.

Tags:    

Similar News