ట్రంప్ సుంకాల కు కళ్లెం!

Update: 2026-02-21 09:18 GMT

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు తన సుంకాలతో చుక్కలు చూపించారు. ఈ బాధిత దేశాల జాబితాలో ఇండియా కూడా ఉంది. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు అనే కారణంతో ఏకంగా 25 శాతం అదనపు సుంకాలు కూడా విధించి ఈ మొత్తాన్ని ఏకంగా 50 శాతానికి తీసుకెళ్లారు. ఇటీవల రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం జరిగి ఇవి 18 శాతానికి చేరిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో అమెరికా సుప్రీం కోర్ట్ డోనాల్డ్ ట్రంప్ కి పెద్ద షాక్ ఇచ్చింది. అమెరికా చట్ట సభల ఆమోదం అంటే కాంగ్రెస్ అనుమతి లేకుండా ప్రెసిడెంట్ ఇలా ఇష్టానుసారం సుంకాలు విధించటం చెల్లదు అని..ఈ అధికారం చట్టసభలకు మాత్రమే ఉంది అని అగ్రరాజ్యానికి చెందిన సుప్రీం కోర్ట్ తీర్పు వెలువరించింది . అయినా సరే డోనాల్డ్ ట్రంప్ మాత్రం సుప్రీం కోర్టు జడ్జిలపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. వాళ్లకు ఏ మాత్రం దేశ భక్తిలేదు..విదేశీ శక్తులకు లొంగిపోయారు అంటూ కూడా ఆరోపించారు.

                                         సుప్రీం కోర్టు ఆదేశాలతో సుంకాల వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చినట్లు అయింది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. దిగుమతులపై 10 శాతం సుంకం విధిస్తామని తేల్చి చెప్పారు. గతంలో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాలపై 10 శాతం సుంకం అమలవుతుందని శ్వేత సౌధం తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 24 నుంచి ఈ సుంకం అమల్లోకి రానుంది. అయితే, ఫార్మాతో పాటు ఇతర రంగాలకు సంబంధించిన దిగుమతులపై గతంలో ఇచ్చిన మినహాయింపులు కొనసాగుతాయని కూడా శ్వేత సౌధం పేర్కొంది. వాణిజ్య ఒప్పందాల తరువాత కూడా అధిక సుంకాలను ఎదుర్కొంటున్న దేశాలపై కూడా 10 శాతం సుంకమే అమలవుతుందని కూడా శ్వేత సౌధం పేర్కొంది. అయితే, వాణిజ్య ఒప్పందాల ప్రకారమే సుంకాల విధించే మార్గాల కోసం ట్రంప్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సుప్రీం కోర్టు తీర్పు తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కూడా స్పందించారు. డీల్ కొనసాగుతుందని అన్నారు.

                               భారత్‌ తమకు సుంకాలను చెల్లిస్తుందని, తాము మాత్రం ఎలాంటి సుంకాలు చెల్లించటం లేదు అని తెలిపారు. దీని వల్ల అమెరికాకు ఎలాంటి భారం ఉండదని అన్నారు. ఇది గతంతో పోలిస్తే భిన్నమైన పరిస్థితి అని అన్నారు. అయితే రెండవ సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ దూకుడు చూస్తున్న వాళ్ళు మాత్రం సుంకాల విషయంలో డోనాల్డ్ ట్రంప్ ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించే అవకాశం ఉంది అని చెపుతున్నారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలతో అమెరికా ఇప్పటి వరకు వసూలు చేసిన సుంకాలను ఆయా దేశంలోని వ్యాపార సంస్థలకు చెల్లించాల్సి ఉంటుందా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సుప్రీం కోర్టు తీర్ఫు తర్వాత కూడా డోనాల్డ్ ట్రంప్ మాత్రం తనకు ప్లాన్ బీ ఉంది అని చెపుతుండంతోనే Full Viewరాబోయే రోజుల్లో సుంకాల విషయంలో ఇంకెన్ని విచిత్ర నిర్ణయాలు తీసుకుంటారో అన్న అనుమానాలు ఎక్కువ మందిలో ఉన్నాయి. అయితే ఇండియాకు మాత్రం గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం 18 శాతం కాకుండా కాకుండా ఇప్పుడు పది శాతం సుంకాలతోనే అమెరికా తో వ్యాపారం చేసే వెసులుబాటు పొందనుంది. ఇతర దేశాలకు సైతం ఇదే వర్తిస్తుంది.

Tags:    

Similar News