అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రకరకాల యుద్ధాలతో ప్రపంచంలో పలు దేశాలను బెదిరిస్తున్న వేళ ఒక కంపెనీ మాత్రం డోనాల్డ్ ట్రంప్ ను డోంట్ కేర్ అంటోంది. ఎన్ని బెదిరింపులు వచ్చిన వెనక్కితగ్గేది లేదు తేల్చి చెపుతోంది. అదే ఆంథ్రోపిక్. ఈ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఐటి ఉద్యోగులను కలవరానికి గురి చేస్తోంది. అంతే కాదు భారతీయ స్టాక్ మార్కెట్ లో ఐటి రాగానికి చెందిన కీలక కంపెనీల షేర్లు భారీ ఎత్తున పతనం అవటానికి కూడా ఇదే కారణం. అమెరికా కు చెందిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ప్రస్తుతం ఐటి రంగంలో సునామికి కారణం అవుతోంది అనే చెప్పాలి. ఆంథ్రోపిక్ అందుబాటులోకి తెస్తున్న ఏఐ టూల్స్ కారణంగా పెద్ద ఎత్తున ఐటి రంగంలో ఉద్యోగాలు పోతాయని నివేదికలు చెపుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది అని ఈ రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరో వైపు ఈ కంపెనీ టూల్స్ కారణంగా దేశీయ ఐటి కంపెనీలకు వచ్చే ఆర్డర్స్ తగ్గుముఖం పట్టి వాటి ఆదాయాలపై ప్రభావం పడుతుంది అనే కారణంతోనే దేశీయ మార్కెట్ లో ఐటి కంపెనీల షేర్లు కుప్పకూలుతున్నాయి. ఈ ప్రభావం ఎంత మేర ఉంటుంది అనే అంశంపై స్పష్టత రావటానికి కొంత సమయం పడుతుంది అని చెపుతున్నారు. ఒక వైపు ఆంథ్రోపిక్ ఐటి రంగంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న వేళ అమెరికా ప్రెసిండెంట్ డోనాల్డ్ ట్రంప్ ఈ కంపెనీకి షాక్ ఇచ్చారు. తమ డిమాండ్స్ కు ఒప్పుకోలేదు అనే కారణంతో ఇప్పుడు ఆయన ఇక నుంచి అమెరికా ప్రభుత్వం ఈ సంస్థతో ఎలాంటి వ్యాపారం చేయదు అని...ఇప్పటి కే ఒప్పందాలు చేసుకున్న వాళ్ళు కూడా దీని నుంచి బయటకు రావాలని ఆదేశించారు. ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ ఏఐ సాంకేతికత వినియోగాన్ని ప్రభుత్వ విభాగాలన్నీ తక్షణం నిలిపివేయాలని తాజాగా ఆదేశించారు. నిఘా, మిలిటరీ వ్యవహారాలకు సంబంధించి క్లాడ్‌లోని భద్రతా నిబంధనలను పూర్తిగా తొలగించేందుకు ఆంథ్రోపిక్ అంగీకరించకపోవడంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా రక్షణ శాఖకు మాత్రం ఆరు నెలల సమయం ఇచ్చారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వామపక్ష భావజాలమున్న ఒక కంపెనీ అమెరికా ప్రభుత్వం ఏం చేయాలో చేయవద్దో చెప్పలేదు అన్నారు. అమెరికాను లొంగదీయాలనుకుని ఆంథ్రోపిక్ పెద్ద తప్పిదానికి పాల్పడిందని మండిపడ్డారు. వారి నిబంధనలకు అమెరికా కట్టుబడేలా చేయాలని చూశారని ఆరోపించారు.
వారి స్వార్థం కారణంగా అమెరికా ప్రజల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని అన్నారు. జాతీయ భద్రతను కూడా ప్రమాదంలోకి నెట్టారని ఆరోపించారు. రాడికల్ వామపక్ష కంపెనీ దేశ భవిష్యత్తును నిర్ణయించజాలదని విమర్శలు గుప్పించారు.ప్రభుత్వ నిఘా, ఆటోమేటిక్ ఆయుధాలకు సంబంధించి క్లాడ్ టెక్నాలజీలో ఉన్న సేఫ్టీ రూల్స్‌ను పూర్తిగా తొలగించాలని ఇటీవల ఆంథ్రోపిక్‌ను అమెరికా కోరింది. ఈ విషయాల్లో ఏఐని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా మార్పులు చేయాలని చెప్పింది. అయితే ఇందుకు ఆంథ్రోపిక్ సంస్థ అంగీకరించలేదు. నిఘా, మిలిటరీ వ్యవహారాల్లో అపరిమిత ఏఐ వినియోగానికి సంబంధించిన నైతిక నిబంధనలను ఉల్లంఘించలేమని సంస్థ తేల్చి చెప్పింది. ఆత్మప్రబోధం ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు గురువారం సంస్థ సీఈఓ డారియో అమోడేయ్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ ఆంథ్రోపిక్‌కు నిబంధనలను సడలించేందుకు 24 గంటల డెడ్‌లైన్ విధించింది. శుక్రవారం నాడు డెడ్‌లైన్ మరో గంటలో ముగియనుండగా ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు.