ఓలా ఎలక్ట్రిక్ షేర్లు మరో కొత్త కనిష్ట స్థాయిని తాకాయి. మంగళవారం నాడు అంటే ఫిబ్రవరి 17 న ఈ షేర్లు 52 వారాల కనిష్ట స్థాయి 27 .36 రూపాయలకు పతనం అయ్యాయి. దీంతో ఇప్పుడు లక్షలాది మంది ఇన్వెస్టర్లు లబోదిబో మంటున్నారు. వరసగా పతనం అవుతూ వస్తున్న ఈ షేర్లను చూసి ఓలా ఎలక్ట్రిక్ భవిష్యత్ పై ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు చేస్తున్న సిఫారసులు వీళ్ళ ఆందోళనను మరింత పెంచుతున్నాయి అనే చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరు పెరగటంతో ఈ రంగంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ షేర్లు కూడా చాలా రోజులు జోష్ చూపించాయి. ఎంతలా అంటే ఈ కంపెనీ షేర్లు జీవిత కాల గరిష్ట ధర 157 రూపాయలకు చేరాయి ఒక దశలో. ఈ కంపెనీ ఐపీవో లో 76 రూపాయల వద్ద ఇన్వెస్టర్లకు షేర్లు జారీ చేసింది. ఐపీవో సమయంలో ఉన్న జోష్ క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో కంపెనీ పెద్ద ఎత్తున సర్వీస్ సమస్యలు ఎదుర్కోవటం...ఆ తర్వాత ఇప్పటికే టూ వీలర్ విభాగంలో ఉన్న దిగ్గజ సంస్థలు కూడా ఈవీ టూ వీలర్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వటంతో ఓలా కష్టాలు మొదలయ్యాయి. ఈ దెబ్బకు ఈవీ టూ వీలర్స్ మార్కెట్ లో ఒకప్పుడు నెంబర్ వన్ గా ఉన్న ఈ సంస్థ వాటా ఇప్పుడు అత్యంత దారుణంగా అంటే ఏకంగా 6 శాతానికి పడిపోయింది.
ఒకప్పుడు ఇది 35 వరకు ఉంది. ఓలా ఎలక్ట్రిక్ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసిక ఫలితాలు ప్రకటించినప్పటి నుంచి ఈ కంపెనీ షేర్లు రోజుకో కొత్త కనిష్ట స్థాయిని తాకుతూ పోతున్నాయి. అదే సమయంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు కూడా ఈ కంపెనీ షేర్ టార్గెట్ ప్రైస్ ను 20 రూపాయలకు తగ్గించటంతో ఈ కౌంటర్ లో ఒత్తిడి మరింత పెరిగింది. మంగళవారం నాడు అంటే ఫిబ్రవరి 17 న ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 52 వారాల కనిష్ట స్థాయి 27.36 రూపాయలకు పతనం అయ్యాయి. ఇండియాలో ఈవీ మార్కెట్ వృద్ధికి భారీ అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో చాలా మంది ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు వీళ్ళు అంతా కూడా భారీ నష్టాలను మూటకట్టుకున్నట్లు అయింది. ఐపీవో ధర ప్రకారం చూసుకున్నా కూడా ఇందులో పెట్టుబడి పెట్టిన వాళ్లకు భారీ నష్టాలు నమోదు అయినట్లే చెప్పాలి. తాజాగా వెల్లడైన ఫలితాలు...కంపెనీ అమ్మకాల పరంగా చూస్తుంటే ఓలా ఎలక్ట్రిక్ రికవరీ కు చాలా సమయమే పట్టే అవకాశం ఉంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇప్పటికిప్పుడు ఈ కంపెనీ షేర్లు ఐపీవో ధరకు చేరటం కూడా కష్టమే అంటున్నారు. ఓలా ఎలక్ట్రిక్ కొద్ది రోజుల క్రితమే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం (బెస్) విభాగంలోకి కూడా ప్రవేశించింది. ఓలా శక్తి పేరుతో వివిధ అవసరాల కోసం పలు ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ లో దిగ్గజ సంస్థల పోటీ ని తట్టుకుని కంపెనీ గాడిన పడాలంటే ఇందుకు చాలా సమాయం పడుతుంది అని చెపుతున్నారు. 2026 -2028 ఆర్థిక సంవత్సరాల్లో ఈ కంపెనీ భారీ నష్టాలు చవిచూడటం తో పాటు నెట్ వర్త్ (నికర విలువ) తుడిచి పెట్టుకుపోయే అవకాశం ఉంది కోటక్ సెక్యూరిటీస్ అంచనా వేసింది.