కొత్త ఎయిర్ పోర్టు ల అభివృద్ధిపై ఫోకస్

Update: 2026-07-22 07:33 GMT

దేశంలో ఇప్పుడు అతి పెద్ద విమానాశ్రయాల ఆపరేటర్స్ అంటే అదానీ గ్రూప్, జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ లిమిటెడ్ లు మాత్రమే. ఇండియాలో అదానీ గ్రూప్ చేతిలో ఏకంగా ఎనిమిది విమానాశ్రయాలు ఉండగా...జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ చేతిలో దేశంలోని ఐదు విమానాశ్రయాలు ఉన్నాయి. అదానీ గ్రూప్ దగ్గర దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబై విమానాశ్రయంతో పాటు అహ్మదాబాబాద్, లక్నో, గువాహటి, తిరువనంతపురం, మంగుళూరు విమానాశ్రయాలు ఉన్నాయి. అదే జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ చేతిలో దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంతో పాటు హైదరాబాద్, గోవా (మోపా), నాగపూర్ విమానాశ్రయంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా అభివృద్ధి చేసిన భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కూడా ఉంది. ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన విమానాశ్రయాలు నిర్వహించే సంస్థలు ఏవీ కూడా ఏ ఎయిర్ లైన్స్ లో అయినా పది శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉండటానికి అనుమతించరు. దేశీయ విమానయాన మార్కెట్ లో ఇప్పుడు 90 శాతం వాటా కేవలం రెండు సంస్థలు అయిన ఇండిగో, ఎయిర్ ఇండియా చేతుల్లోనే ఉంది.

                          మార్కెట్ అంతా కేవలం రెండు సంస్థల చేతిలో ఉన్నందున విమానయాన రంగంలో మరింత పోటీ పెంచేలా ఎయిర్ పోర్టు ఆపరేటర్స్ పై ఉన్న వాటా నిబంధనలను తొలిగించే దిశగా కేంద్ర పౌర విమానయాన శాఖ చర్చలు జరుపుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ మేరకు కేంద్రం కనుక విధానంలో మార్పులు చేస్తే దేశంలో అదానీ, జీఎంఆర్ వంటి సంస్థలు ఎయిర్ లైన్స్ ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుంది. అయితే ఈ ప్రతిపాదనలకు కేంద్ర న్యాయ శాఖ ఆమోదంతో పాటు క్యాబినెట్ ఆమోదం కూడా అవసరం అవుతుంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి. కేంద్రం ఈ నిర్ణయంలో మార్పులు చేయటం కూడా అదానీ గ్రూప్ కు మేలు చేయటం కోసమే అనే చర్చ కూడా సాగుతోంది. అయితే కేంద్రం తన విధానాన్ని మార్చినా వాణిజ్య ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్, జీఎంఆర్ లు వస్తాయా లేదా అన్నది ఇప్పుడే తేలదు. కేంద్రం తన విధానంలో మార్పులు చేస్తే ఆయా సంస్థలకు ఎయిర్ లైన్స్ స్టార్ట్ చేసేందుకు మాత్రం Full Viewమార్గం సుగమం అవుతుంది. దేశంలో విమానయాన రంగం ప్రగతికి అతి తక్కువ ఎయిర్ లైన్స్ ఉండటం కూడా అడ్డంకిగా మారినట్లు ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2047 నాటికీ దేశంలో విమానాశ్రయాల సంఖ్యను 350 కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Tags:    

Similar News