వైసీపీ స‌ర్కారుతో 'లింగ‌మ‌నేనికి డీల్ సెట్ అయిందా' ?!'

Update: 2021-10-06 04:45 GMT

బుక్ లో రాశారు..బుక్ చేయ‌టం మ‌రిచిపోయారా?

వైసీపీ నేత‌ల్లోనే చ‌ర్చ‌నీయాంశం అయిన స‌ర్కారు తీరు

గ‌త తెలుగుదేశం ప్ర‌భుత్వంలో లింగ‌మ‌నేని ర‌మేష్ కు చెందిన ఎల్ఈపీఎల్ సంస్థ‌లు ప్ర‌భుత్వంతో వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబడుల‌కు సంబంధించి 'ఉత్తుత్తి ఎంవోయులు' చాలా చేసుకున్నాయి. అందులో ఒక్క‌టీ ముందుకు సాగ‌లేదు. ఇది అంతా ఒకెత్తు అయితే చంద్ర‌బాబు పాల‌న‌కు సంబంధించి వైసీపీ స‌ర్కారు 'అవినీతి చ‌క్ర‌వ‌ర్తి' అంటూ ఓ పుస్త‌కాన్ని ముద్రించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ బుక్ లో మాత్రం లింగ‌మ‌నేని ర‌మేష్ పై మాత్రం ఇవిగో..అవిగో ఆధారాలు అంటూ ప‌లు క‌థ‌నాలు ప్ర‌చురించారు. బుక్ లో అయితే అక్ర‌మాలు..అవినీతి అంటూ రాశారు కానీ..అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మాత్రం 'బుక్' చేయ‌టం మాత్రం మ‌ర్చిపోయారా?. అంటే మ‌ర్చిపోవ‌టం కాద‌ని..స‌ర్కారుతో డీల్ సెట్ అయింద‌ని వైసీపీ వ‌ర్గాలే చెబుతున్నాయి. అందుకే బుక్ లో పేర్లు కూడా లేనివారిని ఎంతో మందిని బుక్ చేసిన స‌ర్కారు..బ్లాక్ అండ్ వైట్ లో ఎవ‌రిమీద చేయ‌న‌న్ని ఆరోప‌ణ‌లు లింగ‌మ‌నేని ర‌మేష్ మీద చేసి ఈ రెండున్న‌ర సంవ‌త్సరాల్లో అస‌లు ఆ సంస్థ‌ను టచ్ కూడా చేయ‌క‌పోవ‌టం వెన‌క పెద్ద క‌థే న‌డిచింద‌ని స‌మాచారం. వైసీపీ పుస్త‌కంలో లింగ‌మ‌నేని ర‌మేష్ క‌బ్జా చ‌క్ర‌వ‌ర్తి అంటూ ప్ర‌చురించ‌ట‌మే కాకుండా రాజ‌ధాని ప్రాంతంలో ఏకంగా 300 ఎక‌రాల పేద రైతుల భూముల‌ను క‌లిపేసుకున్నార‌ని..వీటి విలువ 1500 కోట్ల రూపాయ‌లు ఉంటుంద‌ని అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప‌క్కా ఆధారాలు ఉన్నాయ‌ని కూడా అందులో రాసుకొచ్చారు. మ‌రి అంత ప‌క్కా ఆధారాలు ఉంటే అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అస‌లు అవినీతిని స‌హించేదిలేద‌ని ప‌దే ప‌దే ప్ర‌క‌టిస్తున్న జ‌గ‌న్ స‌ర్కారు ఎందుకు లింగ‌మ‌నేనిని వ‌దిలేసిన‌ట్లు?. దీని వెన‌క ఏమి జ‌రిగింది?.

ఈ భూముల క‌బ్జానే కాదు..102 కోట్ల రూపాయ‌ల విలువైన భూముల‌ను 33 కోట్ల రూపాయ‌ల‌కే మ‌రో చోట భూమి ద‌క్కించుకున్నార‌ని పుస్త‌కంలో ప్ర‌స్తావించారు. బ్యాంకు త‌న‌ఖా భూముల‌ను కూడా లింగ‌మ‌నేని లాగేసుకున్నార‌ని ప్ర‌స్తావించారు. మ‌రి ఇన్ని అక్ర‌మాలు ఆధారాలతో స‌హా ఉన్నా ఎందుకు వైసీపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌టంలేదు అన్నది క్రిష్ణా జిల్లాలోని వైసీపీ నేత‌ల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. దీని వెన‌క చాలా క‌థ న‌డిచింద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. సాక్షి ప‌త్రిక‌లోనూ లింగ‌మ‌నేనిపై గ‌తంలో ప‌లు క‌థ‌నాలు ప్ర‌చురించారు. ఇప్పుడు అంతా గ‌ప్ చుప్ గా సాగుతోంది. ఇదే పుస్త‌కంలో మెఘాకే పురుషోత్త‌ప‌ట్నం, కొండ‌వీటి వాగు ప‌నులు అంటూ ఇందులో ఏకంగా 930 కోట్ల రూపాయ‌లు క‌మిష‌న్లుగా కాజేయ‌బోతున్నార‌ని రాశారు. కానీ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక ఇదే మెఘాకు అగ్ర‌తాంబూలం వేసి సాగునీటి శాఖ‌తోపాటు వైద్య శాఖ‌లోనూ వేల కోట్ల రూపాయ‌ల ప‌నులు అప్ప‌గిస్తూ పోతున్నారు. ప్ర‌తిపక్షంలో ఉంటే ఒక‌లా..అధికారంలోకి వ‌చ్చాక మ‌రోలా వ్య‌వ‌హ‌రించ‌టం నేత‌లు అంద‌రికీ అల‌వాటుగా మారిపోయింది. ఈ విష‌యంలో జ‌గ‌న్ కూడా చంద్ర‌బాబు మోడ‌ల్ నే ఫాలో అవుతున్నారు.

Tags:    

Similar News