రాష్ట్రంలోని ఏ పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి కూడా రాని అన్ని భూముల అమ్మకం ప్రకటనలు తెలంగాణ లోని కెసిఆర్ సర్కారు నుంచి వస్తున్నాయి. నిత్యం పత్రికల్లో ఇవే ప్రకటనలు దర్శనం ఇస్తున్నాయి. కెసిఆర్ సర్కారు తీరు చూసిన అధికారాలు అసలు ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రభుత్వ భూమిని ఉంచేలా లేదు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున హెచ్‌ఎండీఏ ద్వారా భూముల అమ్మకాలు సాగిస్తున్నారు. అందుకే కెసిఆర్ సర్కారు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలా మారింది అని సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కానుంది. అంటే ఇంకా నిండా రెండు నెలల సమయం కూడా లేదు. అయినా సరే కెసిఆర్ సర్కారు ఇప్పుడు మరో సారి కోకాపేట లో వేల కోట్ల రూపాయల విలువైన 45 .33 ఎకరా భూముల అమ్మకానికి ప్రకటన ఇచ్చింది. ఒక్కో ఎకరం కనీస ధర 35 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. నియో పోలీస్ ఫేజ్ 2 లో మొత్తం ఏడు ప్లాట్స్ గా చేసి 45 .33 ఎకరాలు అమ్మకానికి పెట్టారు. ఎన్నికల ముందు విలువైన భూములు విక్రయించి ఈ డబ్బులను ఎన్నికల ప్రయోజనాలు కలిగే పథకాలకు వాడుకునేలా స్కీం డిజైన్ చేసినట్లు అధికారులు చెపుతున్నారు. అంటే ప్రభుత్వ భూములు అమ్మి తామేదో ప్రజలకు మేలు చేస్తున్నాం అని చెప్పుకోవటం ద్వారా ఎన్నికల్లో లబ్ది పొందే ఎత్తుగడలు వేస్తున్నారు. గతంలో కూడా కోకాపేట లో భూములు అమ్మి సర్కారు రెండు వేల కోట్ల రూపాయలు పైన సమీకరించిన విషయం తెలిసిందే. దళిత బంధు కు వీటిని వాడతామని అప్పటిలో అధికారికంగా ప్రకటించారు.ఇప్పుడు ఈ నిధులను ఏ స్కీం కు వాడతారో చూడాలి. గత కొన్ని నెలలుగా హైదరాబాద్ చుట్టూ పక్కల ఉన్న విలువైన భూములు అమ్మటానికి హెచ్‌ఎండీఏ వరుసగా ప్రకటనలు ఇస్తూ అమ్మకాలు సాగించిన విషయం తెలిసిందే.
ప్రతిపక్షంలో ఉండగా హెచ్‌ఎండీఏ భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ప్రస్తుత మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఆ ఆఫీస్ ముందు ధర్నా కూడా చేశారు. ఆంధ్రా పాలకులు హైదరాబాద్ భూములు అమ్ముతూ దోచుకుంటున్నారు అంటూ అప్పటిలో విమర్శలు గుప్పించారు. కానీ ఆంధ్రా పాలకులు అమ్మిన దానికంటే కెసిఆర్ సర్కారే తెలంగాణ లో పెద్ద ఎత్తున భూముల విక్రయాలు సాగించింది అని అధికారులు చెపుతున్నారు. ఒక వైపు కెసిఆర్, కెటిఆర్ లు ప్రధాని మోడీ రైల్వే భూములు అమ్ముతున్నారు..కంపెనీలు అమ్ముతున్నారు అంటూ విమర్శలు చేస్తూ తెలంగాణ సర్కారు కూడా అదే స్థాయిలో ప్రభుత్వ భూములను అడ్డగోలుగా అమ్ముతూ ముందుకు సాగుతోంది. హైదరాబాద్ లో వందల, వేల కోట్ల రూపాయల విలువైన భూములు అయితే బిఆర్ఎస్ కు లేక పోతే బేరానికి పెడుతున్నారు అని ఒక అధికారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదే కోకాపేట లో బిఆర్ ఎస్ ఆగమేఘాల మీద 11 ఎకరాల హెచ్‌ఎండీఏ భూమిని శిక్షణ కేంద్రం కోసం తీసుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు పార్టీ సిటీ ఆఫీస్ కు కూడా బంజారా హిల్స్ ప్రాంతంలో ఎకరం పైగా కేటాయింప చేసుకుంది. జిల్లాల్లో కూడా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లకు పెద్ద ఎత్తున భూములు తీసుకుంది. మరో వైపు ధరణి తో సర్కారు పెద్దలు పెద్ద ఎత్తున గోల్ మాల్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అమ్మకానికి పెట్టిన భూముల ద్వారానే కనీస ధర ప్రకారం చూసుకున్నా ప్రభుత్వానికి 1575 కోట్లు రాబోతున్నాయి. బిడ్స్ పూర్తి అయితే ఇంతకంటే ఎక్కువ మొత్తం వచ్చే అవకాశం ఉంది చెపుతున్నారు. రాజధాని నగరం చుట్టూ ఉన్న భూములను ఎడా పెడా అమ్మటమే తెలంగాణ మోడల్ లా ఉంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి.