బిఆర్ఎస్ అంత ఫ్రస్ట్రేషన్ లో ఉందా?!

Update: 2023-10-25 09:21 GMT

జయప్రకాశ్ నారాయణ. తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. మాజీ ఐఏఎస్. లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు. ఎన్నికల వేళ తాజాగా అయన టీవీ 9 ఛానల్ కోసం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ఇంటర్వ్యూ చేశారు. ఇదేమీ తప్పు కాదు..తప్పు పట్టాల్సిన అంశం కాదు. కానీ ఆ ఇంటర్వ్యూ లో జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖ్యలు మాత్రం కచ్చితంగా చర్చనీయాంశమే. బిఆర్ఎస్ అధినేత, సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ మోడల్ తెలంగాణ మోడల్ అంటూ చెప్పుకుంటున్నారు. అయితే వాటిని ఎండార్స్ చేసేలా తాజా ఇంటర్వ్యూ లో జయప్రకాశ్ నారాయణ కామెంట్స్ చేశారు. ‘మీరు చేస్తున్న నమూనా నూటికి నూరు పాళ్ళు సరైనది. వెల్త్ క్రియేషన్ వస్తేనే సంక్షేమానికి ఛాన్స్ ఉంటుంది.’ అంటూ అయన కేటీఆర్ పై ప్రసంశలు కురిపించారు. తాము ఏమి చేసైనా ఎన్నికల్లో గెలవటం కోసం కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తోంది అని..అందులో ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీం (ఓపీఎస్) అత్యంత ప్రమాదకరం అని...అది అమలు చేసే రాష్ట్రాలు దివాళా తీయటం ఖాయం అని అన్నారు జెపీ. దేశం గురించి ఆలోచించకుండా..దేశం ఏమైనా సరే తాము గెలవటమే ముఖ్యం అన్నట్లు కాంగ్రెస్ పార్టీ వైఖరి ఉంది అని తప్పు పట్టారు. కెసిఆర్ మాత్రం కమిటీ వేసి అలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు అని ..ఇది చాలా మంచిది అంటూ జయప్రకాశ్ నారాయణ సర్టిఫికెట్ ఇచ్చారు. నిజమే ఓపీఎస్ రాష్ట్రాలపై భారం మోపే అంశమే. కానీ మరి తెలంగాణలో బిఆర్ఎస్ ఇస్తున్న హామీలు. చేస్తున్న పనులు జయప్రకాశ్ నారాయణ కు తెలియవా?. కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని పేద మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తామని ప్రకటిస్తే..ఇదేదో వేలంపాటలాగా బిఆర్ఎస్ తన మానిఫెస్టోలో ఈ మొత్తాన్ని 3000 రూపాయలు చేస్తామని ప్రకటించింది. మరో వైపు కాంగ్రెస్ తాము గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే అందిస్తామంటే బిఆర్ఎస్ ఒక వంద రూపాయలు తగ్గించి 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ పెన్షన్ లు లు నాలుగు వేల రూపాయలు చేస్తామంటే బిఆర్ఎస్ దశలవారీగా తాము ఐదు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇవి పక్కన పెడితే కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు దళిత బందు స్కీమ్ ను తెరమీదకు తెచ్చి పది లక్షల రూపాయల ఇస్తామని ప్రకటించింది బిఆర్ఎస్ కాదా?. బిఆర్ఎస్ ప్రకటించిన దళిత బంధు, బిసి బంధుల అమలుకు ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది..అసలు అవి ఎప్పటిలోగా అమలు అవుతాయి అన్న అంశంపై క్లారిటీ ఉందా?.

                                  జయప్రకాశ్ నారాయణ చెప్పినట్లు బిఆర్ఎస్ ప్రభుత్వం సంపద సృష్టిస్తే స్కీముల అమలుకు ఎందుకు హైదరాబాద్ తో పాటు రాష్ట్రమంతటా భూములు అమ్మింది. భూములే కాదు..ఇప్పటికి అభివృద్ధి చేసిన ఆస్తి ఓఆర్ఆర్ ను ఎందుకు ముప్పై సంవత్సరాల కాలానికి అమ్మినట్లు?. అది కూడా ఎన్నికలకు కొద్ది నెలల ముందు. ఇదే జయప్రకాశ్ నారాయణ కాళేశ్వరం ప్రాజెక్ట్, వచ్చే ఐదేళ్ల కాలంలో 69000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన కొత్త మెట్రో మార్గాలపై తన అభిప్రాయం చెపితే కెసిఆర్ ఫ్యామిలీ కి చెందిన నమస్తే తెలంగాణ పత్రికలో తెలంగాణ ప్రగతిపై జె పీ ఏడుపు అంటూ పేజీలకు పేజీలు ఆర్టికల్స్ ప్రచురించింది. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు..ప్రాజెక్టులపై ఎవరైనా తమ కోణం చెప్పినా...తమ అభిప్రాయం చెప్పినా తట్టుకోలేని...ఏ మాత్రం సహించని బిఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి ఇప్పుడు జయప్రకాశ్ నారాయణకు పర్ఫెక్ట్ గా కనిపిస్తోంది. ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఎన్నికల కోసం హామీలు ఇస్తుంది..బిఆర్ఎస్ మాత్రం అంతా పర్ఫెక్ట్ గా చేస్తుంది అని అభిప్రాయం కలిగించే పని చేశారు. అదే సమయంలో ఏ పార్టీ గెలిచినా తనకు ఉపయోగం ఏమి ఉండేది అని...ప్రజలు అంతా అలోచించి ఓటు వేయాలంటూ కోరుతూ తాను బిఆర్ఎస్ కోసం ఇది అంతా చేయలేదు అని చెప్పుకోవాలని ఆరాటం అయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. మరోవైపు తెలంగాణాలో రాజకీయంగా వాతావరణం కాంగ్రెస్ అనుకూలంగా ఉంది అని ప్రచారం జరుగుతున్నా వేళ ఈ ఇంటర్వ్యూ హాట్ టాపిక్ గా మారింది. జయప్రకాశ్ నారాయణ అంటే పచ్చి తెలంగాణ వ్యతిరేకి..ద్రోహిగా ప్రకటిస్తారు ఆ పార్టీ నేతలు...అలాంటిది ఇప్పుడు కేటీఆర్ ఆయనతో కలిసి ఇంటర్వ్యూ లో పాల్గొని ఒక సానుకూల అభిప్రాయం ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నం చేశారు అంటే బిఆర్ఎస్ ఎంత నిరాశలో ఉందో అర్ధం చేసుకోవచ్చు అనే ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. 

Tags:    

Similar News