ఎన్నికల ముందు వరస కేసు లతో తెలుగు దేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను అధికార వైసీపీ ఇరకాటంలో పెట్టాలని టార్గెట్ గా పెట్టుకుందా?. ఆ పార్టీ నేతల మాటలు చూస్తుంటే ఎవరికైనా ఇదే అనుమానం రాకమానదు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి దగ్గర నుంచి మంత్రి అంబటి రాంబాబు వరకు అందరిది ఒకటే మాట. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని..ఇంకా చాలా కేసు లు ఉన్నాయంటూ చెపుతున్నారు. అందులో ఒకటి ఫైబర్ నెట్ స్కాం, అసైన్ మెంట్ ల్యాండ్స్ , అమరావతి ఇష్యూ, ఐటి కేసు అంటూ చెపుతున్నారు. ఇప్పటికే ప్రముఖ కాంట్రాక్టు సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నారు అనే ఆరోపణలపై చంద్రబాబు కు ఐటి శాఖ నోటీసు లు జారీ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ నేతల మాటలు వింటుంటే మిగిలిన కేసు ల విషయంలో కూడా అధికార పార్టీ దూకుడు పెంచే పనిలో ఉంది అనే అభిప్రాయం టీడీపీ నేతల్లో వ్యక్తం అవుతుంది. దీని ప్రధాన ఉద్దేశం ఎన్నికల ముందు తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు ను ఎంత వీలు అయితే అంత డిస్టర్బ్ చేస్తే రాజకీయంగా వైసీపీ కి అంత లాభం ఉంటుంది అనేది ఆ పార్టీ నాయకుల ఆలోచనగా చెపుతున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో చంద్రబాబును అధికార వైసీపీ విజయవంతంగా జైలు కు పంపటంతో ఆ పార్టీ నేతలు బహిరంగంగానే వేడుకలు చేసుకుంటున్నారు. ఇదే ఊపుతో మిగిలిన కేసు లను కూడా తెరపైకి తెచ్చి చంద్రబాబు ను ఎంత వీలు అయితే అంత మేర రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనేది ఆ పార్టీ ప్లాన్ గా ఒక సీనియర్ నేత వెల్లడించారు. గత కొన్ని నెలలుగా ఒక వైపు చంద్రబాబు, మరో వైపు నారా లోకేష్ పర్యటనలు చేస్తూ టీడీపీ క్యాడర్ లో జోష్ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వాటికీ కొంత బ్రేక్ పడుతుంది. వైసీపీ నేతలు చెపుతున్నట్లు వరసగా పాత కేసు లు అన్ని తెర మీదకు తీసుకొస్తే కీలక నేతలు ఫోకస్ అంతా వాటిపైనే పెట్టాల్సి ఉంటుంది అని చెపుతున్నారు. అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం విషయంలో జరిగినట్లే మిగిలిన కేసు ల్లో కూడా జరుగుతుందా అంటే ఇప్పుడే చెప్పటం కష్టం. పైకి కనిపించేది ఒకటి..తెర వెనక జరిగేవి మరొకటి కావటంతో ఏదైనా జరగవచ్చు అనే టీడీపీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసు ల ఎపిసోడ్ తో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు మరింత కొత్త రూపు సంతరించుకోబోతున్నట్లు కనిపిస్తోంది.