రాజధానుల 'వికేంద్రీకరణ' బిల్లు అప్పుడే!
పక్కా స్కెచ్. అంతా ప్లాన్ ప్రకారమే. మళ్లీ వికేంద్రీకరణ బిల్లు పెట్టే ముహుర్తం కూడా ముందే నిర్ణయం అయిపోయింది. అందుకే భాగస్వాములతో మళ్లీ చర్చలు..మరింత సమగ్రం..సంపూర్ణంగా అంటూ ప్రకటనలు. రాజధాని వంటి అత్యంత కీలకమైన అంశంపై పలు కమిటీలు ఏర్పాటు చేసి..కన్సల్టెంట్ లను పెట్టి నిర్ణయం తీసుకుని..బిల్లులు కూడా ఆమోదింపచేసుకున్న సర్కారు ఇప్పుడు కొత్తగా చర్చలు జరపటానికి ఏముంది? పోనీ ప్రభుత్వం ఏమైనా మార్పులకు సిద్ధపడిందా అంటే అదీ లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా మళ్లీ గత ప్రకటనకు కట్టుబడి ఉండే బిల్లు తెస్తామని నొక్కి మరీ స్పష్టం చేశారు. అంటే ప్రజలు ఏమి చెబుతారో..వారు అనుకునే స్టేక్ హోల్డర్స్ ఏమి వాదనలు విన్పిస్తారో తేలకముందే సీఎం జగన్ తుది నిర్ణయం ప్రకటించేశారు. తుది నిర్ణయం వచ్చాక ఇక అందులో ఎవరైనా మార్పులు ఆశిస్తారా?. ఆశిస్తే అది జరిగే పనేనా?. అంటే నో అనే చెబుతున్నాయి ప్రభుత్వంలోని వర్గాలు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో సర్కారు రాజధాని వికేంద్రీకరణ బిల్లులను శాసనసభ ముందుకు తెచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమయం ఎంచుకోవటం వెనక కూడా చాలా పెద్ద కథ ఉందని సమాచారం. ఈ లోగా ప్రభుత్వం చెప్పిన చర్చలు...న్యాయనిపుణులతో సంప్రదింపులు అన్నీ పూర్తి చేసుకుంటారు. మరో కీలక అంశం ఏమిటంటే అసలు మూడు రాజధానుల బిల్లు, చట్టమే లేనందునే వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీఎం జగన్ తో కొన్ని కీలక శాఖలు విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి పరిపాలన సాగించాలనేది పూర్తిగా ఆయన నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే మూడు రాజధానుల బిల్లుల ఉపసంహరణ సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆ పార్టీకి నష్టం చేసే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని కొంత మంది వైసీపీ నేతలతోపాటు ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. వెనకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే వైజాగ్ కు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ఇంత కాలం చెబుతూ వచ్చారు.
సీఎం జగన్ సోమవారం నాడు అసెంబ్లీలో మాట్లాడుతూ వైజాగ్ లో ఇప్పటికే రహదారులు, డ్రైనేజీతో పాటు అన్ని రకాల వసతులు ఉన్నాయని..బ్యూటిఫికేషన్ తో పాటు చిన్న చిన్న పనులు చేస్తే వచ్చే ఐదేళ్ళలోనే..పదేళ్ళలోనే హైదరాబాద్ లాగా డెవలప్ అవుతుందని వ్యాఖ్యానించారు. అంటే వైజాగ్ లో ప్రభుత్వం కొత్తగా చేయాల్సిన అభివృద్ధి పెద్దగా ఏమీ లేదనే అంశాన్ని ఆయనే చెప్పకనే చెప్పేశారు. తాజా పరిణామాలు అన్నీ చూస్తుంటే ఏపీ రాజదానిపై అనిశ్చితి మరికొన్ని సంవత్సరాలు అలా కొనసాగే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సెప్టెంబర్ లో వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లులు పెట్టి ఆమోదింపచేసుకుంటే..అప్పటికి ఇంకా సర్కారుకు పనులు చేసేందుకు మిగిలే సమయం నికరంగా ఏడాది మాత్రమే ఉంటుంది. అది కూడా ఎలాంటి న్యాయపరమైన అవాంతరాలు తలెత్తకుండా అంతా సాఫీగా సాగిపోతే. దీనికి తోడు ఇప్పటికే ఏపీని ఆర్ధిక సమస్యలు వెంటాడుతున్నాయి. అప్పటికి పరిస్థితి ఇంకా ఎలా మారుతుందో ఊహించలేం. ఈ లెక్కన చంద్రబాబు తన తొలి ఐదేళ్ళలో ఏపీకి శాశ్వత రాజధాని లేకుండా చేస్తే...తర్వాత వచ్చిన జగన్ కూడా తన టర్మ్ లో రాజధాని అనిశ్చితిని అలా కొనసాగించినట్లు అవుతుంది. అంతిమంగా ఏపీ ప్రజలు దాదాపు రెండు టర్మ్ లు రాజధాని గందరగోళంలో గడపాల్సిన పరిస్థితి.