ఐజెయు సమావేశాలకు హ్యాండిచ్చిన కెసిఆర్..కారణం అదేనా?!

Update: 2023-01-11 10:29 GMT

టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారింది. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి వెళ్లాలని సీఎం కెసిఆర్ నిర్ణయించుకున్నారు. ఈ తరుణంలో తెలంగాణ వేదికగా..అది కూడా హైదరాబాద్ నగరంలోనే ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజెయు) సమావేశాలు జరిగాయి. ఇవి జరిగింది కూడా బిఆర్ఎస్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న యూనియన్ ఆధ్వర్యంలోనే. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే క్రాంతి తదితరులు ఢిల్లీ లో డిసెంబర్ 16 న సీఎం కెసిఆర్ ను కలిసి మరి ఈ సమావేశాలకు ముఖ్య అథితిగా రావాలని ఆహ్వానించారు. దీనికి సీఎం కెసిఆర్ సానుకూలంగా స్పందించినట్లు కెసిఆర్ సొంత పత్రిక నమస్తే తెలంగాణాలో కూడా వార్త ప్రచురించారు. కానీ సీఎం కెసిఆర్ అసలు అటువైపు చూడలేదు కూడా. పోనీ ఈ సమావేశాలు జరిగిన జనవరి 8 , 9 , 10 తేదీల్లో సీఎం కెసిఆర్ ఏమైనా ఫుల్ బిజీగా ఉన్నారా అంటే అదేమీ కనిపించదు. కానీ అయన మాత్రం ఈ సమావేశాలకు డుమ్మా కొట్టారు.

                                        జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి ఉన్న అడ్డంకులను సుప్రీమ్ కోర్ట్ గత ఏడాది ఆగష్టు 25 నే తొలిగించింది. దీంతో ప్రభుత్వం ఎప్పుడు అంటే అప్పుడు..ఎక్కడ అంటే అక్కడా స్థలాలు ఇవ్వటానికి ఉన్న ఇబ్బందులు అన్ని తొలగిపోయాయి. కానీ ఈ తీర్పు వచ్చి ఐదు నెలలు కావస్తున్నా కెసిఆర్ మాత్రం దీనికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడం లేదు. నిజానికి ఇది అయన తలచుకుంటే ఐదు అంటే ఐదు నిమిషాల్లో అయిపోతుంది అని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఇప్పటికే స్థలాలు ఇచ్చిన వారి విషయం తో పాటు కొత్తగా ఇవ్వాల్సిన వారి విషయంలోనే కెసిఆర్ నోరు మెదపటం లేదు. ఐజెయు సమావేశాలకు వస్తే మాత్రం దీనిపై స్పందించాల్సి ఉంటుంది అనే డుమ్మా కొట్టారని ప్రచారం సాగుతోంది. సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలు వచ్చాక కెసిఆర్ ఫోటోలకు పాలాభిషేకాలు చేసినవారు మాత్రం ఈ విషయం తప్ప అన్నీ మాట్లాడుతున్నారు.

ఐజెయు సమావేశాలు, హైదరాబాద్

Tags:    

Similar News