కేంద్ర బడ్జెట్ తీరుపై తెలంగాణ పీపీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణకు బడ్జెట్ లో తీవ్ర అన్యాయం చేశారని పీసీసీ ప్రెసిడెంట్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం, బిజెపి ఎంపీల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ధ్వజమెత్తారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇచ్చిన 10 వేల కోట్లు రాష్ట్రాలకు ఏ మాత్రం సరిపోవన్నారు. పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధించడం దారుణమన్నారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తామన్న నినాదం పచ్చి అబద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. మెట్రో రైలు విస్తరణలో హైదరాబాద్‌కు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
లక్షల కోట్ల ప్రజల ఆస్తులను అమ్మేసే ప్రణాళిక రచించడం దారుణమన్నారు. హైదరాబాద్-విజయవాడ బుల్లెట్ ట్రైన్ కేటాయించాలన్నారు.కరోనా పేరుతో ఎంపీల నిధులు కట్ చేశారని, సెంట్రల్ విస్టాకు నిధులు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఎంపీ ల్యాడ్స్ వెంటనే పునరుద్ధరించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ బయ్యారం స్టీల్ ప్లాంట్ తోపాటు రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల ఊసేలేదన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే టీఆర్ఎస్, బిజెపి ఎంపీలు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.