అసలు ఎజెండా వేరేగా ఉందా?!

Update: 2026-03-29 05:10 GMT

Full Viewమా అక్రమాల గురించి ప్రశ్నిస్తే ...మీ అవినీతి తవ్వుతాం. లేకపోతే అన్నీ చూసీ చూడనట్లు వదిలేస్తాం అన్నట్లు తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారా?. శనివారం నాడు తెలంగాణ అసెంబ్లీలో మైనింగ్ అక్రమాలకు సంబంధించిన అంశంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన తీరు చూసిన వాళ్లకు ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది. బిఆర్ఎస్ పదేళ్ల హయాంలో సాగిన అక్రమాలు...అవినీతికి సంబంధించి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా ఏ మాత్రం చిత్తశుద్ధితో వ్యవహరించలేదు అనే అభిప్రాయం ఎక్కువ మంది కాంగ్రెస్ నేతల్లో కూడా ఉంది. ప్రతిపక్షంలో ఉండగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలకు సంబంధించి చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడ వరకో ఎందుకు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు అనేక అనుమానాలకు కారణం అయింది.

                                          ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు కాగ్ నివేదికలో సైతం ప్రస్తావించిన మోటార్లు, పంప్ ల సబ్జెక్టు ను అసలు విచారణ పరిధి నుంచి పూర్తి గా తప్పించటంలోనే కాంగ్రెస్ సర్కారు భారీ స్కాం కు పాల్పడింది అనే చర్చ అధికార, రాజకీయ వర్గాల్లో ఉంది. అందుకే ఈ వ్యవహారాన్ని మొత్తం పక్కకు తప్పించి గతంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కంపెనీని రక్షించి ...ఇప్పుడు అదే కంపెనీతో సీఎం రేవంత్ రెడ్డి కలిసి సాగుతున్న విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ మైనింగ్ విషయానికి వస్తే బిఆర్ఎస్ శనివారం నాడు అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి చెందిన రాఘవా కన్‌స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ చేసింది అని ఆరోపిస్తూ మంత్రిని తప్పించాలి..దీనిపై సభా సంఘం వేయాలని డిమాండ్ చేసింది. ఇదే అంశంపై సభలో చాలా సేపు ఆందోళనకు దిగింది. బిఆర్ఎస్ ఆరోపణలకు సమాధానం చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2014 జూన్ నుంచి ఇచ్చిన మైనింగ్ లీజ్ ల తో పాటు అక్రమ ఇసుక తవ్వకాల వ్యవహారంపై కూడా సీబీసీఐడీ విచారణ జరిపి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నివేదిక పెడతామని ప్రకటించారు.

                                    కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్న సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మాత్రం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కంపెనీ విషయాన్ని సభలో లేవనెత్తగానే బిఆర్ఎస్ హయాంలో సాగిన అక్రమాల గురించి మొత్తం జాబితా చదివారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర అంత సమాచారం ఉన్నప్పుడు ఇంత కాలం ఎందుకు మౌనంగా ఉన్నట్లు?. సిరిసిల్లలోని నేరేళ్లలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలు..అడ్డుకున్న వాళ్లపై దాడుల వ్యవహారం అప్పటిలో పెద్ద దుమారమే రేపింది. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఈ విషయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిపై ఫోకస్ పెట్టి ఉండేవారు అని...కానీ ఆ పని చేయలేదు. మంత్రి పొంగులేటి కంపెనీపై ఆరోపణలు వచ్చిన వెంటనే మాజీ మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు లతో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావు ఫ్యామిలీ, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి గంగుల కమలాకర్ కంపెనీ , మిడ్ వెస్ట్ గ్రానైట్ కంపెనీల అక్రమాలు అన్నింటిపైన సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు.

                                   మంత్రి కంపెనీ రాఘవా కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ పై కూడా విచారణ ఉంటుంది అన్నారు. కేటీఆర్, హరీష్ రావు లు అక్రమ మైనింగ్, ఇసుక మాఫియాతో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు అని రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆరోపించారు. అంత పక్కా సమాచారం ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇంత వరకు వీళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే అనుమానం ఎవరికైనా వస్తుంది కదా?. బిఆర్ఎస్ హయాంలో సాగిన అక్రమాలు..అవినీతి విషయాలను రేవంత్ రెడ్డి పూర్తిగా వదిలేస్తినట్లే కనిపిస్తోంది అని..దీని వెనక భారీ గోల్ మాల్ వ్యవహారాలు నడిచాయనే చర్చ్ కాంగ్రెస్ వర్గాల్లోనే ఉంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేసి...అధికారంలోకి వచ్చేందుకు వాటిని వాడుకుని..ఇప్పుడు ఎన్నో అంశాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు.

Tags:    

Similar News