బిఆర్ఎస్ అధికారంలో ఉంటే అసెంబ్లీ దేవాలయం. అదే బిఆర్ఎస్ ప్రతిపక్షంలోకి మారితే మాత్రం సభలో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తర్వాత అసెంబ్లీ సాక్షిగా అప్పటి సీఎం కెసిఆర్ విలువలు...పద్దతుల గురించి ఎన్నో మాటలు చెప్పారు. అసెంబ్లీ అంటే పవిత్ర దేవాలయం అని, దేశానికి తెలంగాణ అసెంబ్లీ ఆదర్శంగా ఉండేలా చూడాలన్నారు. ఎవరైనా సరే వెల్ లోకి వస్తే ఆటోమేటిక్ గా సస్పెండ్ అయ్యేలా చూడాలి అంటూ మాట్లాడారు. ఇలాంటి విషయాలు కెసిఆర్ అప్పటిలో చాలానే చెప్పారు. కానీ ఇప్పుడు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం సభలో కెసిఆర్ చెప్పిన దానికి పూర్తి రివర్స్ లో వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా మంత్రి పొంగులేటికి చెందిన కంపెనీ అక్రమ మైనింగ్ తో పాటు ఏ విషయంపై అయినా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. ఇరకాటంలో పెట్టొచ్చు. కానీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో వ్యవహరించిన తీరు మాత్రం ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలకు...ఇప్పుడు చేస్తున్న దానికి ఏ మాత్రం పొంతన లేకుండా పోయింది అనే చెప్పాలి.
అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు సభ్యులు అంతా కూడా ఖచ్చితంగా నియమ, నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఆదివారం నాడు అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్ వ్యవహరించిన తీరు దుమారం రేపుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి చెందిన కంపెనీ రాఘవా కన్‌స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ వ్యవహారంపై సభా సంఘం వేయాలని డిమాండ్ చేస్తూ సభలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇందులో తప్పుపట్టాల్సింది ఏమి లేదు. కానీ ఈ సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ తన మోచేతిని మరో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మీద వేసి నిల్చున్న తీరు తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. సభలో ఇలా నిలుచోవటం ఏ మాత్రం సరికాదు అని..ఇది సభా సంప్రదాయం కాదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విచిత్రం ఏమిటి అంటే కేటీఆర్ సభా సంప్రదాయాలను తుంగలో తొక్కి తాను అసెంబ్లీలో ఉన్నాను అనే విషయం మరిచిపోయి బయట ప్రైవేట్ ప్లేస్ లో ఉన్నట్లు వ్యవహరించినా కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించింది. అధికారులతో పాటు సీనియర్ నేతలు కూడా కేటీఆర్ తీరును తప్పుపడుతున్నారు. మాజీ మంత్రి...బిఆర్ఎస్ భవిష్యత్ లో అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న నాయకుడు శాసనసభలో ఇలా వ్యవహరించటం ఏ మాత్రం సరికాదు అనే చర్చ సాగుతోంది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో కూడా వైరల్ గా మారింది. కొద్ది నెలల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ కూడా రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని...తలపై కళ్ళజోడు పెట్టుకుని మాట్లాడి తీవ్ర విమర్శల పాలు అయ్యారు.