ప్రజల సొమ్మును రక్షించింది లేదు...తప్పులు చేసిన వాళ్ళను శిక్షించింది లేదు !
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి రెండున్న సంవత్సరాలు దాటుతోంది. అయినా సరే పలు కీలక విషయాల్లో ఎలాంటి యాక్షన్ లేకపోగా...ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లే ఆరోపణలు చేసుకుంటూ పోతున్నారు. తెలంగాణాలో మరో పదేళ్లు తానే ఉంటానన్న తరహాలో ప్రకటనలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఎన్నికల సమయంలో కూడా ఇవే మాటలు చెపుతారా?. మరి ఐదేళ్లు అధికారంలో ఉండి ఏమి చేశారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఏమి సమాధానం వస్తుంది. లేదు కేవలం రాజకీయం కోసమే ఈ ఆరోపణలు తప్ప..ప్రజల సొమ్మును రక్షించేందుకు కాదు...తప్పులు చేసిన వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవటానికి కాదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పదల్చుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శుక్రవారం నాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు.
శుక్రవారం నాడు సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు -రంగారెడ్డి తో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పధకం పనులను పరిశీలించారు. ఆ తర్వాత మీడియా తో మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి పనులతో కెసిఆర్ ఇంట్లో కనకవర్షం కురిసింది అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కమిషన్ల పేరుతో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు అని విమర్శించారు. ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ చేయకుండానే కేవలం పుంపులు...లిఫ్ట్ పనులు చేసి అవినీతికి పాల్పడ్డారు అని ఆరోపించారు. మరి ఇన్ని పక్కా ఆధారాలు పెట్టుకుని...కెసిఆర్ ఇంట్లో కనకవర్షం కురిసింది అని చెప్పుకుంటూ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ప్రజలు బిఆర్ఎస్ తో కాంగ్రెస్ సర్కారు కూడా కుమ్మక్కు అయింది అన్న అనుమానాలు రావా అన్న చర్చ తెరమీదకు వస్తోంది. మరో వైపు తెలంగాణాలో నిర్మించిన లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు.