ఏఎంఆర్ గ్రూప్ సంస్థలపై జరిగిన ఈడీ దాడులకు సంబంధించిన దర్యాప్తు సంస్థ శుక్రవారం నాడు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అందులో పలు కీలక విషయాలు వెల్లడించింది. ఈడీ దాడుల్లో కీలక సమాచారం పొందినట్లు వెల్లడించారు. అవేంటి అన్నది రాబోయే రోజుల్లో అయినా బయటకు వస్తాయో లేదో చూడాలి. ఏఎంఆర్ సంస్థలపై జరిగిన ఈడీ దాడులు దక్షిణాది రాష్ట్రాల్లోనే ప్రకంపనలు రేపాయి. దీనికి ప్రధాన కారణం ఈ సంస్థల అధినేతకు పలు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలతో ఉన్న అత్యంత సన్నిహిత సంబంధాలే. ఏఎంఆర్ సంస్థ ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు పలు జిల్లాల్లో సీనరేజ్ వసూలు కాంట్రాక్టు పనులు చేయటంతో పాటు ఇటీవలే మరో సంస్థతో కలిసి దగ్గర దగ్గర 8000 వేల కోట్ల రూపాయల పైచిలుకు అంచనా వ్యయంతో కూడిన పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్ట్ ను దక్కించుకుంది. శుక్రవారం నాడు ఈడీ విడుదల చేసిన ప్రకటనలోని వివరాలు ఇలా ఉన్నాయి.

                                          ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి చెందిన కోల్‌కతా జోనల్ కార్యాలయంకోల్‌కతాకు చెందిన శ్రేయి గ్రూప్ రుణాల ఎగవేతకు సంబంధించి కొనసాగుతున్న మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా, ఒడిశాకు చెందిన ఏ ఆర్ఎస్ఎస్ గ్రూప్, హైదరాబాద్‌కు చెందిన ఏఎంఆర్/ఏఎంఆర్ ఎల్ గ్రూప్ ప్రమోటర్లు, అనుబంధ సంస్థలకు సంబంధించిన వివిధ ప్రాంగణాల్లో ఈ నెల 11 న PMLA 2002లోని సెక్షన్ 17 కింద సోదాలు నిర్వహించింది. ఈ సోదాల సందర్భంగా మొత్తం 6.35 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఫ్రీజ్ చేశాం. ఇందులో సుమారు రూ.1.50 కోట్ల బ్యాంకు నిల్వలు, సుమారు రూ.2.90 కోట్ల డీమ్యాట్/సెక్యూరిటీల హోల్డింగ్స్, సుమారు రూ.1.95 కోట్ల విలువైన నగదు, నగలు ఉన్నాయి. ఈ దర్యాప్తు శ్రేయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ , శ్రేయి ఎక్విప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి పై రెండు గ్రూపులు, ఇతర వివిధ సంస్థలు పొందిన మోసపూరిత/అక్రమ రుణాలు పొందటంపైనే.

                                                 రుణాలు తీసుకుని ఆ తర్వాత వాటిని తిరిగి చెల్లించకపోవడంతో ఈ విచారణ సాగుతోంది. ఇందులో అనుమానిత ఎవర్‌గ్రీనింగ్, నిధుల మళ్లింపు/రౌండ్-ట్రిప్పింగ్, ఇతర అక్రమాలు కూడా ఉన్నాయి. ఏఎంఆర్ఎల్ హైటెక్ సిటీ లిమిటెడ్, ఏఎం ఆర్ ఎల్ గ్రూప్, ఏఆర్ ఎస్ఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ తదితర సంస్థలు శ్రేయి నుంచి భారీ ఎత్తున రుణ సదుపాయాలను పొందాయి. అయితే ఆ రుణాలు తర్వాత చెల్లించకుండా బకాయిలుగా/డిఫాల్ట్‌గా మిగిలిపోయాయి. పీఎంఎల్ఏ కింద సోదాలు నిర్వహించిన పై గ్రూపులకు సంబంధించి మొత్తం రూ.1,111 కోట్ల రుణాలు బకాయిగా ఉన్నాయి. సోదాల సమయంలో వివిధ డిజిటల్ పరికరాలు, ఖాతాల పుస్తకాలు, స్థిర/చర ఆస్తులు, ఇతర సంబంధిత రికార్డులు/పత్రాలను కూడా వివరణాత్మక పరిశీలన కోసం స్వాధీనం చేసుకున్నాం. సంబంధిత సంస్థలు, వ్యక్తుల ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల స్థితిగతులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఈ సోదాల ద్వారా సేకరించినట్లు ఈడీ తెలిపింది.

Tags: