తెలంగాణ లో మరో రెండేళ్లలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చాలా మంది బహిరంగంగా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. కొంత మంది అయితే నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కూడా టార్గెట్ చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖ కుమార్తె అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కాయి అని...ఆయన కుటుంబ సభ్యులు ఇష్టానుసారం భూ అక్రమాలకు పాల్పడుతున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఖండించని కొండా సురేఖ అసలు వాటితో తనకు ఏమి సంబంధం అని ప్రశ్నించారు. దీంతో ఇలా అయితే రెండేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం సాఫీగా ముందుకు సాగటం కష్టం అనే అభిప్రాయానికి ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలు వచ్చారు. క్రమశిక్షణ కమిటీ కూడా ఇదే నివేదికను అధిష్టానానికి ఇచ్చింది. అందుకు ప్రతిఫలంగానే ఇప్పుడు మంత్రి గా ఉన్న కొండా సురేఖ పై వేటు పడింది. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఒక మంత్రి పై వేటు పడటం ఇదే మొదటి సారి.
కొండా సురేఖ, చిన్నారెడ్డి లపై వేటు వేయటం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కారు రెండేళ్ల పాటు సాఫీగా ముందుకు సాగటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. అయితే కొండా సురేఖ, చిన్నా రెడ్డి వంటి నేతలపై వేటు వేయటం ద్వారా కాంగ్రెస్ లో క్రమశిక్షణ వస్తుందా అంటే అనుమానమే. అయితే కొంతలో కొంత ఈ కీలక సమయంలో పార్టీ హై కమాండ్ సీఎం రేవంత్ రెడ్డి కి అండగా నిలవటంతో రాబోయే రోజుల్లో సీఎం తన పదవీకాలాన్ని సాఫీగా పూర్తి చేసుకునేందుకు మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది అని చెప్పొచ్చు. అయితే క్రమశిక్షణ చర్యల విషయంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్లకు మాత్రం ఇవేమి వర్తించటం లేదు. ఒక్క రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాదు...కొంత మంది ఎమ్మెల్యేలు కూడా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. క్యాబినెట్ లో ఖాళీల భర్తీ...నామినేటెడ్ పోస్ట్ ల భర్తీ తర్వాత ఎవరైనా అసమ్మతి నేతలు గళం విప్పుతారా లేక అంతా సర్దుకుపోతారా అన్నది కొద్దిరోజులుపోతే కానీ తేలదు.
క్యాబినెట్ నుంచి బర్తరఫ్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను అన్యాయంగా పదవి నుంచి తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉరిశిక్ష పడిన వ్యక్తికీ చివరిసారిగా ఏదైనా చెప్పుకునే అవకాశం ఇస్తారని, తనకు మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వకుండా శిక్షించారని అన్నారు. తన కుమార్తె కొండా సుస్మిత పటేల్ వ్యాఖ్యలకు తనను శిక్షించడం ఏంటని.. ఆమె అభిప్రాయంతో తనకేం సంబంధమని కాంగ్రెస్ పెద్దలను సురేఖ ప్రశ్నించారు. రాజీనామా చేయమంటే చేసేదాన్నని, తన వివరణ అడిగి చర్యలు తీసుకుంటే బాగుండేదన్నారు. నిజంగా తాను తప్పు చేసి ఉంటే బర్తరఫ్ చేసినా పర్వాలేదని అన్నారు. 'మంత్రి పదవి నాకు ఆభరణం మాత్రమే. కారణం చెప్పకుండా తొలగించడం బాధాకరం. గతంలో మంత్రి పదవికి స్వయంగా నేనే రాజీనామా చేశా. ప్రస్తుతం మంత్రులు సంతోషంగా లేరు. ఈ విషయం గుండెపై చేయి వేసుకొని వారు చెప్పాలి. మంత్రులంతా బయటకు వచ్చి మాట్లాడాలి. పనులు కావాలంటే ఎవరి వద్దకు వెళ్లాలో అర్థం కాదు. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని కోరుతున్నాను. నేను పార్టీని, ప్రభుత్వాన్ని ఏం అనలేదు. మల్లు రవి కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టినవారే. ఇందిరాగాంధీని జైపాల్ రెడ్డి తిట్టారు. రోశయ్య సైతం ఇందిరాగాంధీని తిట్టారు.
సీఎం రేవంత్‌పై ఆరోపణలు చేసిన వారికీ పదవులు ఇచ్చి సన్మానం చేశారు.ఎవరి అండ లేకుండా మేం పైకి వచ్చాం. నా భర్తను కారులో ఎక్కించుకొని వరంగల్ అంతా తిప్పారు. మా కాళ్లు మొక్కి మాతో ప్రచారం చేయించుకున్న వాళ్లూ మమ్మల్ని తిడుతున్నారు. మా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్సీకి వాళ్ల భార్య కూడా ఓటేయదు. నన్ను తొలగించాలనే ఆలోచన ఏఐసీసీకి లేదు. బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేసి నన్ను బర్తరఫ్ చేశారు. వేం, పొంగులేటి, తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి ఏకమై నన్ను ఇబ్బంది పెట్టారు. డబ్బులు వసూలు చేసిన వాడే నా మాజీ ఓఎస్డీ సుమంత్‌పై కేసు పెట్టాడు. సుమంత్ పేరు చెప్పి కిరణ్ అనే వ్యక్తి డబ్బులు వసూలు చేశాడు. తమ ప్రభుత్వంలో తమ మనుషులను ఇబ్బంది పెట్టుకోవడం చరిత్రలో ఎక్కడా లేదు. సుమంత్‌ని ఇబ్బంది పెట్టడం ఆపేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. కాంగ్రెస్ సర్కార్ సరిదిద్దుకోవాల్సిన, మార్చుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.ప్రభుత్వం మళ్లీ రావాలంటే చాలా మార్పులు జరగాలి. మోనోపాలీ లాగా వెళ్లడం సరైంది కాదు. తనకు తానే ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం సరికాదు. నిర్ణయాలు తీసుకునేప్పుడు చర్చించాలి. ఎమ్మెల్యేగా ఉంటాను.. నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తాను. నాకు పార్టీలో ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నా. నా కూతురు వ్యాఖ్యలను నేను ఖండిస్తే ఆమెను కించపరిచినట్టు అవుతుంది. మంత్రిగా తొలగించడం అవమానమని అనుకోవడం లేదు. నేను తప్పు చేస్తే ఇబ్బంది పడేదాన్ని. తప్పు చేయకుండా బర్తరఫ్ చేయడం పార్టీ తప్పు. రేవంత్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తేడా ఉంది' అని అన్నారు.