పార్టీలు అన్నిటిది ఒకటే బాట. తమకు అధికారం అప్పగిస్తే చాలు అద్భుతాలు చేస్తామని ఎన్నికల ముందు నమ్మబలుకుతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అద్భుతాల సంగతి అటు ఉంచి ప్రజలందరి ఉమ్మడి ఆస్తిని ఎడాపెడా అమ్ముకుంటూ తాము ఏదో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నట్లు చెప్పుకుంటారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో జరిగింది అదే. ఇప్పుడు కాంగ్రెస్ ...సీఎం రేవంత్ రెడ్డి పాలనలో సాగుతున్నది కూడా అదే. బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కెసిఆర్ దేశంలోని నాయకులకు అసలు ప్రణాళికలు లేవు అని..లేకపోతే దేశం ఇలా ఎందుకు ఉంటుంది అని అధికారంలో ఉన్న సమయంలో ఎన్నో సార్లు చెప్పారు. కానీ ఆయన రాష్ట్రంలో ఎన్ని అద్భుతాలు చేశారో అందరూ చూశారు. చివరకు దళితబంధు పధకం అమలుకు కోకాపేట లో వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు అమ్మి ఈ స్కీమును ప్రారంభించారు. ఒక్క కోకాపేటలోని కాదు...హెచ్ఎండీయే పరిధిలో ఉన్న వేలు..వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను గజాల లెక్కన కూడా విక్రయించారు.
భవిష్యత్ లో ప్రభుత్వ అవసరాలకు భూములు ఏ మేరకు అవసరం అవుతాయి అనే అంశాన్ని ఏ మాత్రం మదింపు చేయకుండా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు భూముల అమ్మకాలను కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గత బిఆర్ఎస్ పాలనకు ఏ మాత్రం తేడా లేకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను విక్రయిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. గతంలో ఇదే రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ హయాంలో సాగిన భూముల విక్రయాలపై ఎన్నో విమర్శలు...ఆరోపణలు చేశారు. బిఆర్ఎస్ కూడా తక్కువేమి కాదు. అధికారంలోకి రాకముందు హైదరాబాద్ లో భూముల విక్రయాలను తప్పుపట్టిన ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎడాపెడా భూములను విక్రయించిన సంగతి తెలిసిందే.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం రాయదుర్గంలో 5 .38 ఎకరాలను విక్రయించటం ద్వారా 1447 కోట్ల రూపాయలు సమీకరించింది. ఇక్కడ ఎకరా ధర రికార్డు స్థాయిలో 269 కోట్ల రూపాయలు పలికింది. ఒక్క రాయదుర్గం భూముల వేలం ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా 8400 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని పొందింది. టీజీఐసీసి ద్వారా ఈ భూముల వేలం నిర్వహిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా హెచ్ఎండీఏ ద్వారా తెలంగాణ సర్కారు భూములు విక్రయిస్తోంది. ఇవి అన్నీ చూస్తే బిఆర్ఎస్ హయాంలో సాగినట్లే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా భూముల అమ్మకాలు సాగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ భూములు అమ్మి తాము గొప్ప పరిపాలన సాగిస్తున్నట్లు నాయకులు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.