బిఆర్ఎస్ కు బలం కేసీఆరే. బలహీనత కూడా ఆయనే. అధికారంలో ఉన్నప్పుడు అలాగే చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా అలాగే చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన కెసిఆర్ తన పదవి కాలం సమయంలో ఎక్కువ శాతం ఫార్మ్ హౌస్...ప్రగతి భవన్ లకు పరిమితం అయ్యే పాలన సాగించారు. పాత సచివాలయానికి భయంకరమైన వాస్తు దోషాలు ఉన్నాయని..ఇతరత్రా కారణాలు చెప్పి ఆయన సచివాలయానికి రాలేదు....అంతే కాకుండా ఏకంగా కొత్త సచివాలయం కూడా కట్టించారు. తొలుత 616 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొదలుపెట్టిన ఈ సెక్రటేరియట్ పూర్తి అయ్యే నాటికీ 1100 కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. ఇంత ఖర్చుపెట్టిన కట్టించిన కొత్త సచివాలయానికి అయినా కెసిఆర్ వచ్చారా అంటే అది కూడా లేదు. సచివాలయం నిర్మాణం తో పాటు ఐటి పరికరాల కొనుగోలులో కూడా భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు విజిలెన్సు గుర్తించింది. వీటిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కారు అన్నిటిలాగానే ఈ విషయాన్నీ కూడా పూర్తిగా వదిలేసింది. ఇందులో ఏమి జరిగింది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకే తెలియాలి.

                                         ఈ సంగతి కాసేపు పక్కనపెడితే గత ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాల్లో అప్పటి సీఎం కెసిఆర్ అటు మంత్రులకే కాదు..ప్రజలకు ఎవరికీ అందుబాటులోకి లేకపోవటం కూడా ఒక ప్రధాన కారణంగా నిలిచింది. ముఖ్యమంత్రి గా కాకుండా రాజుల తరహాలో పాలన అంతా కూడా ఫార్మ్ హౌస్, ప్రగతి భవన్ ల నుంచి నడిపించారు అని ఆయన తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కెసిఆర్ అదే స్టైల్ ఫాలో అవుతున్నారు. గతం తో పోలితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగే రోజులు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. ఈ సమావేశాలకు కూడా బిఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేతగా ఉన్న కెసిఆర్ హాజరు కావటం లేదు. ఎప్పటిలాగానే ఆయన ఫార్మ్ హౌస్ కే పరిమితం అవుతున్నారు. ఇప్పుడు దీన్నే అధికార కాంగ్రెస్ పార్టీ ఒక కీలక అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ...భద్రత తో పాటు వివిధ అంశాలపై ప్రతిపక్ష నాయకుడి మీద ప్రభుత్వం వెయ్యి రోజుల్లో 22 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా కూడా ఆయన ప్రజల కోసం..తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజల కోసం ఏ మాత్రం పని చేయటం లేదు అని విమర్శలు గుప్పిస్తోంది.

                                          ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసారాంబాగ్ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇదే అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. పని చేయని ప్రతిపక్ష నేత కెసిఆర్ తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 6 న ఇందిరా పార్టీ దగ్గర మహా ధర్నాకు శ్రీకారం చుట్టింది. కెసిఆర్ సభకు హాజరుకాకుండా ఉండటం పై ఆ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు లు ఎంత సమర్ధించుకున్నా కూడా దీనికి ప్రజల నుంచి ఆమోదం లభించదు అనే చెప్పాలి. రాజకీయంగా కచ్చితంగా ఇది బిఆర్ఎస్ కు నష్టం చేసే అంశమే. బిఆర్ఎస్ నేతలు వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని పదే పదే చెపుతున్నారు. కాసేపు అదే నిజం అనుకున్నా బిఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చినా కూడా కెసిఆర్ అదే స్టైల్ ఫాలో అవుతారు అనే విషయాన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ల ప్రయత్నాల్లో ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ఉండి కెసిఆర్ అలాగే చేస్తున్నారు కాబట్టి ఇందులో ఎలాంటి మార్పులు ఉండవు అనే విషయం ప్రజలకు ఈజీ గా కూడా కనెక్ట్ అవుతుంది. జెన్ జీ రాజకీయాల్లో ఫుల్ యాక్టీవ్ అవుతున్న తరుణంలో తెలంగాణ సెంటిమెంట్ ఉన్న సమయంలో నడిపించినట్లు ఇప్పుడు బిఆర్ఎస్ రాజకీయం నడవటం కష్టమే అన్న అభిపాయాన్ని కొంత మంది బిఆర్ఎస్ నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

Full View

Tags: